Asianet News TeluguAsianet News Telugu

Ravindra Jadeja: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో ఆసియా కప్ నుంచి రవీంద్ర జడేజా ఔట్

Asia Cup 2022: ఆసియా కప్ - 2022లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి గాయంతో ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.  
 

Ravindra Jadeja Ruled Out of Asia Cup 2022 Due to Injury, Axar Patel Replaced Him
Author
First Published Sep 2, 2022, 5:42 PM IST

ఆసియా కప్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి జోరుమీదున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గాయమైంది. దీంతో అతడు ఆసియా కప్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. జడేజా కుడి మోకాలికి గాయమవడంతో అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. సూపర్-4లో కీలక  మ్యాచ్ లు  ఉన్న నేపథ్యంలో జడేజా దూరమవడం భారత జట్టుకు కోలుకోలేని దెబ్బే. 

ఇదే విషయమై బీసీసీఐ ఒక ప్రకటనలో.. ‘జడేజా కుడి మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఆసియా కప్ లో మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడు.  ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు...’ అని తెలిపింది. 

గాయపడిన జడేజా స్థానంలో మరో యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ‘గాయపడిన జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. అతడు త్వరలోనే జట్టుతో కలుస్తాడు.  అక్షర్ ఇప్పటికే  ఈ టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికయ్యాడు.  త్వరలోనే అతడు జట్టుతో కలవనున్నాడు. 

గత కొంతకాలంగా జడేజా గాయాలతో సావాసం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతూ గాయపడ్డ అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేదు.  ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంకలతో జరిగిన సిరీస్ లు ఆడాడు.  ఐపీఎల్ లో 8 మ్యాచులాడి మళ్లీ గాయంతో సీజన్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. దీంతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్ లో కనిపించలేదు. గాయం నుంచి కోలుకున్నాక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జడ్డూ.. అక్కడ మరోసారి గాయపడ్డాడు.  ఫలితంగా వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ఆడలేదు. ఇక ఇటీవలే ముగిసిన జింబాబ్వే సిరీస్ లో విశ్రాంతి తీసుకుని ఆసియా కప్ ఆడుతున్న జడేజా.. రెండు మ్యచులుమాత్రమే ఆడి మళ్లీ గాయపడటం గమనార్హం. 

మరో 40 రోజుల్లో  ఆసీస్ వేదికగా టీ20  ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఆసియా కప్  నుంచి తప్పుకున్నాడు. మరోవైపు కెఎల్ రాహుల్ కూడా గాయాలతోనే సతమతమవుతున్నాడు. ఓ  సిరీస్ ఆడితే మరో సిరీస్ లో గాయపడుతున్నాడు. ఇదే ఫార్ములాను  జడ్డూ కూడా పాటిస్తుండటం బాధాకరం. అసలే టీమిండియాకు ఆల్ రౌండర్ల కొరత ఉన్న నేపథ్యంలో నాణ్యమైన ఆల్ రౌండర్ అయిన జడేజా గాయపడితే  పొట్టి ప్రపంచకప్ లో భారత్ కు కష్టాలు తప్పవని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఇక ఆసియా కప్ లొో ఇప్పటికే సూపర్ - 4కు చేరిన భారత జట్టు వచ్చే ఆదివారం (పాకిస్తాన్ - హాంకాంగ్ మ్యాచ్ విజేత) మరోసారి పాక్ తో తలపడే అవకాశముంది. గ్రూప్-బి నుంచి అఫ్గానిస్తాన్, శ్రీలంక కూడా అంత తేలికైన జట్లేమీ కాదు. ఈ క్రమంలో భారత్ కు జడేజా లేకపోవడం పెద్ద లోటే.. 

 

Follow Us:
Download App:
  • android
  • ios