రీఎంట్రీలో అదరగొట్టిన రవీంద్ర జడేజా... 8 వికెట్లు తీసి సూపర్ ఫామ్‌తో టీమిండియాలోకి...
తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన సౌరాష్ట్ర కెప్టెన్ రవీంద్ర జడేజా... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి గుడ్‌న్యూస్...

ఆసియా కప్ 2022 టోర్నీ మధ్యలో గాయపడి, టీమిండియాకి దూరమయ్యాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా దూరంగా రవీంద్ర జడేజా, దాదాపు ఆరు నెలల తర్వాత క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైన రవీంద్ర జడేజా, చాలా కాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండడంతో రంజీ ట్రోఫీలో ఆడి ఫామ్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది బీసీసీఐ...
తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆడుతున్న రవీంద్ర జడేజా, బ్యాటుతో పెద్దగా మెప్పించలేకపోయాడు. అయితే బౌలింగ్‌లో తన మ్యాజిక్ చూపించాడు జడ్డూ. తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లు బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజా 3 మెయిడిన్లతో 48 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ చెలరేగిపోయాడు. 17.1 ఓవర్లలో 3 మెయిడిన్లతో 53 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా...
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 142.4 ఓవర్లలోనే 324 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
సాయి సుదర్శన్ 45, అపరాజిత్ 45, ఇంద్రజిత్ 66, విజయ్ శంకర్ 53, షారుక్ ఖాన్ 50 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర జట్టు 79.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చిరాగ్ జానీ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలివగా జై గోహిల్ 25, వసవదా 21, హార్విక్ దేశాయ్ 21 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్రకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రవీంద్ర జడేజా 23 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లో తమిళనాడు జట్టు 36.1 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌట్ అయ్యింది. యంగ్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ డకౌట్ కాగా సాయి సుదర్శన్ 72 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు...
హిట్టర్ షారుక్ ఖాన్‌ని 2 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత 28 పరుగులు చేసిన బాబా ఇంద్రజిత్‌ని బౌల్డ్ చేశాడు. 8 పరుగులు చేసిన తమిళనాడు కెప్టెన్ పరోష్ పౌల్, జడ్డూ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న విజయ్ శంకర్ 10 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఎస్ అజిత్ రామ్, సిద్ధార్థ్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన జడ్డూ, సందీప్ వారియర్‌ని కూడా అవుట్ చేసి తమిళనాడు ఇన్నింగ్స్‌కి తెరదింపాడు....
మొత్తంగా బౌలింగ్‌లో 8 వికెట్లు తీసి, సూపర్ ఫామ్‌ని నిరూపించుకున్నాడు రవీంద్ర జడేజా. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేయాల్సి ఉంటుంది. జై గోహిల్ డకౌట్ కావడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది సౌరాష్ట్ర... జడ్డూ బ్యాటుతో కూడా అదరగొడితే ఇక టీమిండియాకి జడ్డూ లాంటి మ్యాచ్ విన్నర్ సూపర్ ఫామ్‌లో టీమ్‌లోకి వచ్చినట్టే.