Asianet News TeluguAsianet News Telugu

అశ్విన్ హాఫ్ సెంచరీ, కుల్దీప్ మెరుపులు... తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్...

తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, పూజారా హాఫ్ సెంచరీలు... కుల్దీప్ యాదవ్ మెరుపులు.. 

Ravichandran Ashwin scores half century, Team India All-out in 1st Innings
Author
First Published Dec 15, 2022, 1:01 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 404 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 278/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా 126 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. 

శ్రేయాస్ అయ్యర్ 192 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసి టీమిండియా తరుపున తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ అవుటైన తర్వాత కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 8వ వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

113 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 114 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు...

అశ్విన్ భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చి స్టంపౌట్ కాగా కుల్దీప్ యాదవ్‌ని తైజుల్ ఇస్లాం ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. వస్తూనే రెండు సిక్సర్లు బాదిన ఉమేశ్ యాదవ్ 10 బంతుల్లో 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మహ్మద్ సిరాజ్ ఓ ఫోర్ బాది, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కి తెరబడింది...

భారత ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 4, కోహ్లీ 1 మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా మాజీ కెప్టెన్ విరాట్ లోయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.  బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ నాలుగేసి వికెట్లు తీయగా ఎబదత్ హుస్సేన్, ఖలీద్ అహ్మద్‌లకు చెరో వికెట్ దక్కింది...

తొలి రోజు ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లోనే శ్రేయాస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయినా బెయిల్స్ కిందపడకపోవడంతో నాటౌట్‌గా తేలాడు. నేటి ఉదయం ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ని లిటన్ దాస్ జారవిడిచాడు. దీంతో మూడు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న శ్రేయాస్ అయ్యర్, సెంచరీకి 14 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. 

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది టీమిండియా. 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్, తొలి రోజు ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టుని రిషబ్ పంత్‌తో పాటు ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకున్నారు. రిషబ్ పంత్ 46 పరుగులు చేసి అవుట్ కాగా, ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు... ఐదో వికెట్‌కి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పూజారా వికెట్ కోల్పోయింది టీమిండియా. 

తన స్టైల్‌లో 125 బంతుల్లో టెస్టుల్లో 34వ హాఫ్ సెంచరీ అందుకున్న ఛతేశ్వర్ పూజారా... 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసి సెంచరీ చేరువులో అవుటై పెవిలియన్ చేరాడు.  40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో యాసిర్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 54 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... 5 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్. డీఆర్‌ఎస్ తీసుకున్నా ఉపయోగం లేకపోయింది.  48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, 45 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టిన రిషబ్ పంత్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios