IPL 2022 LSG vs RCB: ఐపీఎల్-15 ఎలిమినేటర్ లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో  ఛేదనలో నెమ్మదిగా ఆడిన లక్నోపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి  విమర్శలు గుప్పించాడు.

భారీ లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటతీరు ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ముఖ్యంగా ఆ జట్టు సారథి కెఎల్ రాహుల్ ఆటపై శాస్త్రి విమర్శలు గుప్పించాడు. అతడు ఇంకాస్త ముందుగానే విజృంభించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని చెప్పాడు. కీలక భాగస్వామ్యం కొనసాగుతున్న సమయంలో ఒకరు ధాటిగా ఆడినప్పుడు మరొకరు నెమ్మదిగా ఆడినా ఏమీ కాదని కానీ ఇద్దరూ స్లోగా ఆడితే ఎలా అని ప్రశ్నించాడు. ఆ వైఖరే లక్నో కొంప ముంచిందని తెలిపాడు. 

రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘వాళ్లు (లక్నో) ఇంకాస్త ముందుగా ధాటిగా ఆడితే బాగుండేది. టీ20 లో కొన్నిసార్లు మీరు చివరిదాకా ఉండే ప్రయత్నం చేయాలి. అందులో తప్పులేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అయితే అలా చేయడం కుదరదు. 9వ ఓవర్ నుంచి 14వ ఓవర్ దాకా మరీ నెమ్మదిగా ఆడారు. 

కీలక భాగస్వామ్యం (దీపక్ హుడా-కెఎల్ రాహుల్) కొనసాగుతున్న తరుణంలో ఒకరు ధాటిగా ఆడితే మరొకరు నెమ్మదిగా ఆడినా సరిపోతుంది. ఎవరో ఒకరు బౌలర్లను టార్గెట్ చేయాలి. హుడా నెమ్మదించిన క్రమంలో రాహుల్ ధాటిగా ఆడితే బాగుండేది. అతడు లీడ్ తీసుకుని హిట్టింగ్ చేస్తే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. 9-13 ఓవర్ మధ్య అతడు హిట్టింగ్ కు దిగితే లక్నో పని ఈజీ అయ్యేది. అప్పుడు ఆర్సీబీ కూడా కాస్త నెర్వస్ అయి ఒత్తిడికి గురయ్యేది... కానీ లక్నో ఇలా చేయలేదు..’ అని తెలిపాడు. 

బెంగళూరుతో మ్యాచ్ లో 58 బంతుల్లో 79 పరుగులు చేశాడు రాహుల్. తొలి పవర్ ప్లేలో కొంచెం ధాటిగానే ఆడినట్టు కనిపించినా అతడు మిడిల్ ఓవర్స్ లో నెమ్మదించాడు. 7 వ ఓవర్ నుంచి 13 వ ఓవర్ వరకు అతడు ఒక్కటంటే ఒక్కటే ఫోర్ కొట్టడం గమనార్హం. ఒకవైపు సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతున్నా రాహుల్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఆడాడు.

Scroll to load tweet…

ఫలితంగా ఈ మ్యాచ్ లో 208 పరుగుల ఛేదనలో లక్నో... 193 పరుగుల వద్దే ఆగిపోయింది. దీపక్ హుడా (26 బంతుల్లో 45.. 1 ఫోర్, 4 సిక్సర్లు) కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. రాహుల్ తో కలిసి హుడా.. నాలుగో వికెట్ కు 96 పరుగులు జోడించాడు. మిడిల్ ఓవర్స్ లో మరీ నెమ్మదిగా ఆడటం.. కీలక సమయంలో చివరి పవర్ ప్లే లో వికెట్లు కోల్పోవడంతో లక్నోకు ఓటమి తప్పలేదు.