Asianet News TeluguAsianet News Telugu

సచిన్ ఆరు వరల్డ్ కప్స్ ఆడాడు.. కొన్ని జరగాలంటే ఓపిక అవసరం : రవిశాస్త్రి

ఐసీసీ  ట్రోఫీ గెలవడం అంతా ఆషామాషీ కాదని.. భారత క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ తన కలను నెరవేర్చుకునేందుకు  ఆరు వరల్డ్ కప్ లు ఆగాడని టీమిండియా  మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. 

Ravi Shastri opens up on India's ICC trophy drought, Says This MSV
Author
First Published Mar 25, 2023, 12:15 PM IST | Last Updated Mar 25, 2023, 12:15 PM IST

భారత్  ఐసీసీ ట్రోఫీ గెలిచి  పదేండ్లు కావొస్తుంది.  చివరిసారిగా  2013లో  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత  మళ్లీ   భారత్  దానిని దక్కించుకోలేదు.  పలుమార్లు సెమీస్, ఫైనల్స్ వరకూ వెళ్లినా అక్కడ బొక్క బోర్లా పడుతున్నది. అయితే ఈ ఏడాది  ఐసీసీ ట్రోఫీని దక్కించుకోవడానికి భారత్ కు రెండు అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో  టీమిండియా..  ఐసీసీ ట్రోఫీ కరువును తీరుస్తుందా..? అన్న ప్రశ్నకు భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఐసీసీ ట్రోఫీ సాధిచండం  ఆషామాషీ కాదని,  భారత క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్.. ఈ ట్రోఫీని గెలిచేందుకు  24 ఏండ్లు వేచి చూశాడని,  మెస్సీ  కూడా   సచిన్ మాదిరిగానే తన చివరి ప్రపంచకప్ లో కల నెరవేర్చుకున్నాడని  అన్నాడు. 

స్పోర్ట్స్ యారితో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం భారత్   గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తోంది.  టీమిండియా  సెమీఫైనల్స్, ఫైనల్స్  వరకూ వెళ్లగలుగుతోంది.  సచిన్ ను చూడండి.  వరల్డ్ కప్ కల  సాధించుకోవడానికి అతడు ఆరు ప్రపంచకప్ లు ఆడాడు. అంటే  24 ఏండ్లు.   తాను ఆడిన చివరి ప్రపంచకప్ లో అతడు  దానిని సాధించుకున్నాడు. తాజా ఉదాహరణ  మెస్సీ. అర్జెంటీనా తరఫున ఎంత కాలంగా ఆడుతున్న అతడు   కోపా అమెరికా కప్ తో పాటు గతేడాది ఫిఫా వరల్డ్ కప్ లో విక్టరీ కొట్టాడు. నేను చెప్పొచ్చేదేంటంటే.. కొన్ని జరగాలంటే మీకు ఓపిక అవసరం...’అని చెప్పాడు. 

2013లో మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు  ఇంగ్లాండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమిండియా మళ్లీ  దానిని దక్కించుకోవడంలో వరుసగా విఫలమవుతోంది.   2014 టీ20 వరల్డ్ కప్, 2015, 2019లలో వన్డే వరల్డ్ కప్, 2016, 2021, 2022  టీ20 వరల్డ్ కప్ తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ,  2021 లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్   లో కూడా ఓటమిపాలైంది.   

కానీ ఈ ఏడాది భారత్ ఇదివరకే అర్హత సాధించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో  మెరుగ్గా ఆడితే  విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా మొదలయ్యే ఈ మ్యాచ్ మీద భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.  ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ కూడా జరగాల్సి ఉంది.  స్వదేశంలో జరుగబోయే ఈ టోర్నీలో కప్ కొట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ  మెగా టోర్నీ కోసం భారత జట్టు ఇదివరకే 20 మందితో కూడిన కోర్ గ్రూప్  ను తయారుచేసి వారినే రొటేట్ చేయాలని భావిస్తున్నది.  అయితే వీరిలో పలువురు గాయపడుతుండటం  భారత జట్టును కలవరపరుస్తున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios