వచ్చే రెండు మూడేళ్లలో భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని చీఫ్ కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ప్రస్తుతం ఇండియన్ టీం చాలా పటిష్టంగా వుందని...దాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ఇకపై తన లక్ష్యమని అన్నాడు. జట్టులోనే కాదు ఆటగాళ్ల ప్రదర్శనలో కూడా భారీ మార్పులు తీసుకువచ్చి మరింత మెరుగ్గా తీర్చిదిద్దతానని అన్నాడు.

టీమిండియా చీఫ్ కోచ్ పదవిని మరోసారి దక్కించుకున్న రవిశాస్త్రి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో రెండేళ్లపాటు చీఫ్ కోచ్ గా భారత జట్టుకు సేవలందించే అవకాశం మళ్లీ తనకు దక్కడం అదృష్టమన్నాడు. తనపై నమ్మకంతో ఈ అవకాశాన్నిచ్చిన క్రికెట్ అడ్వైజరీ కమిటీతో పాటు బిసిసిఐకి కృతజ్ఞతలు తెలిపాడు. 

ప్రస్తుతం భారత జట్టు చాలా నిలకడగా ఆడుతోందని...ఇది ఇలాగే  కొనసాగాలంటే బలమైన వారసత్వం అవసరమన్నాడు. ఆ దిశగానే తన ప్రయత్నం వుంటుందని తెలిపాడు. యువ క్రికెటర్లను సానబట్టి వారిలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసుకురాగలిగితే భారత జట్టు మరింత పటిష్టమవుతుందన్నాడు. మరీ ముఖ్యంగా తన పదవీకాలం  ముగిసేలోపు మరో ఇద్దరు,ముగ్గురు యువ బౌలర్లను గుర్తించి వారిని అత్యుత్తమ బౌలర్లుగా  తీర్చిదిద్దాల్సి వుందన్నాడు. అప్పుడే తాను సంతోషంగా ఈ పదవి నుండి తప్పుకోగలనని అన్నాడు. 

ఈ రెండు మూడేళ్లలో చాలా  మంది యువ క్రికెటర్లు జట్టులోకి  వచ్చే అవకాశాలున్నాయి. వారిని టీ20, వన్డే పార్మాట్లలోనే కాకుండా టెస్టుల్లో కూడా రాణించేలా తీర్చిదిద్దాల్సి వుంటుంది. అలా ఈసారి తనముందు పెద్ద సవాలే వుందని రవిశాస్త్రి అన్నాడు. 

ఒక్క బౌలింగ్ లోటును మినహాయిస్తే బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయంలో భారత జట్టులో ఎలాంటి లోటు లేదన్నాడు. గతంలో కంటే ఇప్పుడున్న ఆటగాళ్ల పీల్డింగ్ చాలా బాగుందన్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ పరుగులను ఆపడం, క్యాచులు, రనౌట్లు చేయడం ద్వారా జట్టు విజయాల్లో ఫీల్డర్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.     

వీడియో