ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన చెన్నై స్టార్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఒకే ఒక్క మ్యాచ్‌తో అందరి నోళ్లు మూయించాడు. చెన్నై జట్టు వాట్సన్ ను ఓపెనింగ్ నుండి తప్పించాలన్నవారే మంగళవారం అతడి అసాధారణ ఇన్నింగ్స్ చూసి  నోరెళ్లబెట్టారు. ఇలా చెన్నై వేధికగా చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వాట్సన్ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన అతడిలో మరింత కసిని పెంచినట్లు కనిపిస్తోంది. సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ అతడిలో కసిని పెంచి  భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడానికి కారణమయ్యాడు. 

అసలు ఏం జరిగిందంటే:

సన్ రైజర్స్ హైదరాబాద్ మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసింది. ఇందులో ఎప్పటిలాగే డేవిడ్ వార్నర్( 57 పరుగులు) రెచ్చిపోవడంతో పాటు మనీశ్ పాండే(83) చెలరేగడంతో సన్ రైజర్స్ 175 పరుగుల స్కోరు సాధించింది. 176 పరుగుల లక్ష్య చేధనకోసం బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్ వాట్సన్ తో సన్ రైజర్స్ బౌలర్ దూరుసుగా ప్రవర్తించాడు. 

రషీద్ ఖాన్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతినే వాట్సన్ బౌండరీకి తరలించాడు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన రషీద్ కోపంతో వాట్సన్ పైకి దూసుకెళ్లాడు. అంతేకాకుండా అతడివైపు ఉరిమిచూశాడు. అతడి అలా వ్యవహరిస్తున్నా వాట్సన్ ఎదురుతిరగలేదు. కానీ అతడు తన బ్యాట్ తోనే రషీద్ కే కాదు సన్ రైజర్స్ జట్టుకు ధీటుగా జవాభిచ్చాడు. 

తనపై అసహనం ప్రదర్శించిన రషీద్ ఖాన్ ను అయితే వాట్సన్ చీల్చి చెండాడాడు. అతడితో పాటు చెన్నై బ్యాట్ మెన్స్ అందరూ అతడి బౌలింగ్ ను ఉతికి ఆరేయడంతో ఈ మ్యాచ్ లో ఏకంగా అతడు 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా ఐపిఎల్ లో చెత్త గణాంకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 

మొత్తంగా వాట్సన్ చెలరేగి ఆడి కేవలం 53 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో  96 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. ఇలా వాట్సన్ ఒంటిచేత్తో చెన్నైని గెలిపించి తన సత్తా చాటడంతో పాటు రషీద్ దుందుడుకు చర్యలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు.   

వీడియో