Highest Score in Ranji Trophy: టీ20 క్రికెట్ కు క్రేజ్ పెరుగుతున్న ఈ కాలంలో   సాంప్రదాయక రంజీలలో అదరగొడుతున్నారు భారత యువ కిషోరాలు.  రోజుల తరబడి బ్యాటింగ్ చేస్తూ రికార్డులను బద్దలుకొడుతున్నారు. 

దేశవాళీ సీజన్ లో భాగంగా జరుగుతున్న రంజీ మ్యాచులలో జార్ఖండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి నాగాలాండ్ పై జాలి, దయ, కరుణ అనేదే లేకుండా వీర బాదుడు బాదుతున్నది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఏకంగా ముగ్గురు జార్ఖండ్ బ్యాటర్లు.. డైనమైట్లలా పేలారు. నాగాలాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. 880 పరుగుల భారీ స్కోరు చేశారు. ఈ రికార్డు స్కోరులో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ చేయగా.. ఇద్దరు సెంచరీలు, ముగ్గురు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో జార్ఖండ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 

రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన నాలుగో జట్టుగా జార్ఖండ్ చరిత్రలోకెక్కింది. నాగాలాండ్ తో మ్యాచులో తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు.. 203.4 ఓవర్లలో 880 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో టోర్నీ చరిత్రలో హైదరాబాద్, తమిళనాడు, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానంలో నిలిచింది. అంతకుముందు మహారాష్ట్ర పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 

Scroll to load tweet…

1993-94 సీజన్ సందర్భంగా హైదరాబాద్ జట్టు.. ఆంధ్రపై 944-6 చేసింది. రంజీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఆ తర్వాత జాబితాలో తమిళనాడు.. గోవాపై (912-6 డిక్లేర్డ్), మధ్యప్రదేశ్ కర్నాటకపై (912-8 డిక్లేర్డ్) ఉన్నాయి. జార్ఖండ్ కంటే ముందు ముంబై.. హైదరాబాద్ (855-6 డిక్లేర్డ్) పై ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలువగా జార్ఖండ్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టింది. 

జార్ఖండ్ సాధించిన ఈ భారీ స్కోరులో 17 ఏండ్ల యువ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (270 బంతుల్లో 266.. 37 ఫోర్లు, 2 సిక్సర్లు) ద్విశతకంతో కదం తొక్కగా నదీమ్ (304 బంతుల్లో 177.. 22 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ సింగ్ (153 బంతుల్లో 107.. 13 ఫోర్లు) ల శతకాలూ ఉన్నాయి. ఈ ముగ్గురే గాక.. కుమార్ సూరజ్ (69), అంకుల్ రాయ్ (59) రాహుల్ శుక్లా (85 నాటౌట్) హాప్ సెంచరీలు చేశారు. రాహుల్ శుక్లా జార్ఖండ్ తరఫున ఆఖరి వికెట్ గా వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 

Scroll to load tweet…

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ లో 880 పరుగులు చేయగా.. బదులుగా నాగాలాండ్ 289 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంకా ఆ జట్టు 591 పరుగులు వెనుకబడి ఉంది. నాగాలాండ్ ఇన్నింగ్స్ లో చేతన్ బిస్ట్ (122) సెంచరీ సాధించాడు. జార్ఖండ్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన కుశాగ్రా.. 2020 లో భారత్ తరఫున అండర్-19 ప్రపంచకప్ లో కూడా ఆడాడు.