Ranji Trophy 2022: ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 725 పరుగుల తేడాతో భారీ విక్టరీ అందుకున్న ముంబై జట్టు... సెమీ ఫైనల్స్‌కి ముంబై, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్... 

69... శృంగారంలో ఈ పొజిషన్ అంటే చాలా మందికి భలే ఇష్టం. అయితే ఇదే ఫిగర్, రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకి ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో బిగ్గెస్ట్ విక్టరీని అందించింది. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై జట్టు 725 పరుగుల తేడాతో భారీ..... విజయాన్ని నమోదు చేసింది...

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనే ఇదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు 1930లో న్యూ సౌత్ వేల్స్ టీమ్, క్వీన్స్‌లాండ్‌పై 685 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతకుముందు 1928లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో అందుకుంది... ఇవన్నీ రికార్డులను చెరిపేస్తూ 700లకు పైగా పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న మొట్టమొదటి జట్టుగా సరికొత్త చరిత్ర లిఖించింది ముంబై...

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్‌కి సర్ఫారాజ్ ఖాన్, సువేద్ పార్కర్ కలిసి భారీ స్కోరు అందించారు. 166.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 647 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది ముంబై.. కెప్టెన్ పృథ్వీ షా 21, యశస్వి జైస్వాల్ 35, అమన్ జాఫర్ 60 , షంసీ ములానీ 59, తనుష్ కోటియన్ 28, తుషార్ దేశ్‌పాండే 20 పరుగులు చేయగా సర్ఫారాజ్ ఖాన్ 205 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 153 పరుగులు చేశాడు...

మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న సువేద్ పార్కర్ 447 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో 252 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 41.1 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కమల్ సింగ్ 40, రాబిన్ బిస్త్ 25, దిశాంశు నేగీ 12 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు...

తొలి ఇన్నింగ్స్‌లో 533 పరుగుల భారీ ఆధిక్యం దక్కినప్పటికీ ఫాలోఆన్ ఆడించని ముంబై జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లు బ్యాటింగ్ చేసి 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పృథ్వీ షా 80 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ 150 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు...

ఆదిత్య తారే 56 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేశాడు. 794 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఉత్తరాఖండ్ 27.5 ఓవర్లలో 69 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కునాల్ చండేలా 21, శివమ్ కురానా 25 మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యారు. ఇద్దరు ఓపెనర్లతో పాటు ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం.

తొలి ఇన్నింగ్స్‌లో శామ్స్ ములానీ 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో ధవల్ కుల్‌కర్ణి, శామ్స్ ములానీ, తనుష్ కోటియన్ మూడేసి వికెట్లు తీసి ముంబైకి భారీ విజయాన్ని అందించారు. మూడో క్వార్టర్ ఫైనల్‌లో కర్ణాటకపై 5 వికెట్ల తేడాతో ఓడించింది ఉత్తర్‌ప్రదేశ్...

నాలుగో క్వార్టర్ ఫైనల్‌లో మధ్యప్రదేశ్, పంజాబ్‌ని 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌ 545 పరుగుల భారీ ఆధిక్యంతో సాగుతోంది. దీంతో సెమీ ఫైనల్‌లో ముంబై జట్టు, ఉత్తర ప్రదేశ్‌తో, మధ్య ప్రదేశ్ జట్టు, బెంగాల్‌‌ను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి...