ఐపీఎల్‌లో సెంచరీ చేసిన నెల రోజులకు రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లోనూ సెంచరీ బాదిన రజత్ పటిదార్... ఫైనల్ మ్యాచ్‌లో ముంబైపై ఆధిక్యం సాధించిన మధ్యప్రదేశ్.. ఎంపీ ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున సెంచరీ చేసి, బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న రజత్ పటిదార్, అదే ఫామ్‌ని, జోరును రంజీ ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022 ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది...
నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 475 పరుగుల భారీ స్కోరు చేసింది మధ్యప్రదేశ్. యష్ దూబే 336 బంతుల్లో 14 ఫోర్లతో 133 పరుగులు చేయగా శుబ్‌మన్ ఎస్ శర్మ 215 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 116 పరుగులు చేశాడు.. హిమాన్షు మంత్రి 31, ఆదిత్య శ్రీవాస్తవ 25, ఆక్షత్ రఘువంశీ 9, పార్థ్ సహానీ 11 పరుగులు చేసి నిరాశపరిచినా రజత్ పటిదార్ 195 బంతుల్లో 20 ఫోర్లతో 120 పరుగులు చేశాడు...
రజత్ పటిదార్‌కి ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ కాగా, ఏడో 50+ స్కోరు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 54, రెండో ఇన్నింగ్స్‌లో 53 పరుగులు చేసిన రజత్ పటిదార్, మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులు చేశాడు.
కేరళతో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగులు చేసి అదరగొట్టిన రజత్ పటిదార్, పంజాబ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 85 పరుగులు చేశాడు. బెంగాల్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే అవుటైన రజాత్ పటిదార్, రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగులు చేశాడు...
8 ఇన్నింగ్స్‌లో 7 సార్లు 50+ స్కోర్లు చేసిన రజాత్ పటిదార్, ఐపీఎల్ 2022 ముందు నుంచి సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. 2012-13 సీజన్ తర్వాత ముంబై జట్టు, ఒకే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు సమర్పించడం ఇదే తొలిసారి. సరిగ్గా నెల రోజు మే 25న ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రజత్ పటిదార్, నెల తర్వాత జూన్ 25న రంజీ ట్రోఫీ ఫైనల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం..
రజత్ పటిదార్‌కి 71 ఇన్నింగ్స్‌ల్లో ఇది 8వ సెంచరీ. ఇప్పటికే ఈ సీజన్‌లో 89.3 సగటుతో 600లకు పైగా పరుగులు పూర్తి చేసుకున్నాడు రజత్ పటిదార్. 2018-19 సీజన్‌లో 713 పరుగులు చేసిన రజత్ పటిదార్, ఓపెనర్ యష్ దూబే తర్వాత ఈ సీజన్‌లో 600+ పరుగులు చేసిన రెండో మధ్య ప్రదేశ్ బ్యాటర్‌గా నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 374 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పృథ్వీ షా 47, యశస్వి జైస్వాల్ 78, ఆర్మాన్ జాఫర్ 26, సువేద్ పార్కర్ 18, హార్ధిక్ తామోర్ 24, శామ్స్ ములానీ 12, తనుష్ కొటియన్ 15 పరుగులు చేయగా సర్ఫరాజ్ ఖాన్ 134 పరుగులు చేసి సీజన్‌లో మరో సెంచరీ నమోదు చేశాడు...
లంచ్ బ్రేక్ సమయానికి ముంబై జట్టు కంటే 101 పరుగుల ఆధిక్యంలో ఉంది మధ్యప్రదేశ్. ఫైనల్ మ్యాచ్‌లో మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో మధ్యప్రదేశ్‌కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
