రాంచీ: టెస్టు మ్యాచులకు పనికి రాడని భావించిన రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాడు. టీమిండియా ఓపెనర్ గా దిగుతున్న రోహిత్ శర్మ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో వరుస ఇన్నింగ్సుల్లో సెంచరీలు సాధించి ఓపెనర్ గా దిగిన తొలి మ్యాచులోనే ప్రపంచ రికార్డును సృష్టించాడు. తాజాగా, ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మన్ గా కూడా రికార్డులకు ఎక్కాడు. 

రాంచీలో దక్షిణాఫ్రికాపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో మూడో సిక్సర్ కొట్టిన తర్వాత ఈ సిరీస్ లో 16వ సిక్సర్ ను తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. దాంతో ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా వెస్టిండీస్ ఆటగాడు హెట్మియర్ రికార్డును బద్దలు కొట్టాడు. 2018 - 19 సీజన్ లో బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో హెట్మియర్ 15 సిక్సర్లు కొట్టాడు. దాన్ని రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. 

అదే సమయంలో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా రోహిత్ శర్మ తుడిచిపెట్టాడు. 2010-11 సీజన్ లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో హర్భజన్ సింగ్ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్ లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో శనివారంనాడు రోహిత్ శర్మ 13 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. అదే సమయంలో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇది రోహిత్ కు 30వ టెస్టు మ్యాచ్.

సునీల్ గవాస్కర్ రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఒక సిరీస్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో సునీల్ గవాస్కర్ తర్వాత ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. గవాస్కర్ తన కెరీర్ లో ఒక్క సిరీస్ లో మూడు అంతకన్నా ఎక్కువ సెంచరీలు మూడు సార్లు సాధించాడు.