Asianet News TeluguAsianet News Telugu

అది తప్పుడు ప్రచారం.. అఫ్రిది వైద్యానికయ్యే ఖర్చంత మాదే.. స్పష్టం చేసిన పీసీబీ చీఫ్

Pakistan Cricket Board: పాకిస్తాన్ యువ స్పిన్నర్ షాహీన్ షా అఫ్రిది ఆసియా కప్ కు ముందు గాయపడి లండన్ లో వైద్యం చేయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అతడు వైద్యానికి సొంత డబ్బులు వెచ్చిస్తున్నాడని వివాదం తలెత్తింది. 

Ramiz Raja Clarifies Shaheen Shah Afridi's Injury Controversy, Says This
Author
First Published Sep 18, 2022, 1:48 PM IST

 శ్రీలంకతో సిరీస్ ముగిశాక గాయంతో ఆసియా కప్ కు దూరంగా ఉన్న  పాకిస్తాన్ యువ సంచలనం షాహీన్ అఫ్రిది  ప్రస్తుతం లండన్ లో చికిత్స చేయించుకుంటున్నాడు. అయితే అతడి వైద్యానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నయా పైసా ఇవ్వడం లేదని.. అంతా అఫ్రిదియే పెట్టుకుంటున్నాడని తలెత్తిన వివాదానికి బోర్డు చీఫ్ రమీజ్ రాజా  స్పష్టత ఇచ్చాడు. తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన.. ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బయట జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని.. అఫ్రిది వైద్యానికయ్యే ఖర్చులను తాము భరిస్తున్నామని తెలిపాడు. 

ఫ్యాన్ ఫోరమ్ అనే వెబ్ ఛానెల్ తో రమీజ్ రాజా మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశాడు. ‘అసలు మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు..? షాహీన్ ను మేం పట్టించుకోవడం లేదని అనడం తగదు. ఇది దురదృష్టకరమైన వివాదం.. 

గతేడాది టీ20 ప్రపంచకప్ లో మహ్మద్ రిజ్వాన్ గాయపడితే మా వైద్య బృందం అతడితోనే ఉండి రిజ్వాన్ కు కావాల్సినవన్నీ చూసుకున్నది. అంత బాగా చూసుకున్నందుకే కదా. రిజ్వాన్  ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ఆడే వీలు లేకున్నా  వైద్యులు ఇచ్చిన సపోర్ట్ తో ఎలా ఆడాడో..  ఆటగాళ్లు, వారి ఆరోగ్యం చూసుకోవడం మా బాధ్యత. మేం ఎప్పుడూ అఫ్రిదిని ఒంటరిగా వదిలేయలేదు.  అయితే షాహీన్ వసతి, హోటల్  రూమ్ వంటి విషయాల్లో ఏదైనా సమస్యలుంటే ఉండొచ్చు గానీ అతడికి అండగానే ఉన్నాం..’ అని క్లారిటీ ఇచ్చాడు.  

 

మూడు రోజుల క్రితం షాహీన్ షా అఫ్రిది కాబోయే మామ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. ‘షాహీన్ తన సొంత ఖర్చుతో లండన్ కు వెళ్లాడు. విమానం టికెట్ ఖర్చులు కూడా అతడివే.  లండన్ లో షాహీన్ ఖర్చు పెడుతున్న ప్రతీ పైసా అతడిదే. షాహీన్ కోసం నేను అక్కడ నాకు తెలిసిన ఒక డాక్టర్ తో మాట్లాడాను. షాహీన్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడు. అతడి విషయంలో పీసీబీ వ్యవహరిస్తున్న తీరు ఏం బాగోలేదు. జట్టుకు ఎంతో సేవ చేస్తున్నా అతడిని మాత్రం పీసీబీ పట్టించుకోవడం లేదు.   పీసీబీ నుంచి జకీర్ ఖాన్ (పీసీబీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్) ఒక్కసారో.. రెండుసార్లో మాట్లాడాడు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

అఫ్రిది చేసిన ఈ కామెంట్లు పాకిస్తాన్ క్రికెట్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. పాక్ మాజీలు దీనిని ఖండిస్తూ పీసీబీ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజా పై విధంగా స్పందించడం గమనార్హం.  

Follow Us:
Download App:
  • android
  • ios