న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేశారు. సంఘంలోని వివిధ ఒత్తిళ్ల కారణంగా తాను కొనసాగలేకపోతున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో తెలిపారు. గతంలో క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు ఉన్న విభేదాలు బయటకు వచ్చాయి. 

క్రికెట్ సంఘంలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని, కొంత మంది క్రికెట్ క్రీడపై కాకుండా స్వార్థపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, అందుకే తాను పదవికి రాజీనామా చేస్తున్నానని రజత్ శర్మ అన్నారు. నిజాయితీకి, పారదర్శకతకు విరుద్ధంగా తాను రాజీపడి తన విధానాలకు వ్యతిరేకంగా పనిచేయలేనని ఆయన స్పష్టం చేశారు. 

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మరణం తర్వాత రజత్ శర్మ ఒత్తిళ్లను ఎదుర్కుంటున్నప్పుడు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ వివిధ గ్రూపులను ఒక్క తాటిపై నిలబెట్టే విషయంలో విశేషంగా కృషి చేస్తు వచ్చారు. రజత్ శర్మకు అరుణ్ జైట్లీ మద్దతు ఉండడంతో బాధ్యతలు నిర్వహించడంలో ఇబ్బంది కలగలేదని, జైట్లీ మరణం తర్వాత రజత్ శర్మకు నిలదొక్కుకోవడం కష్టంగా మారిందని అంటున్నారు. 

తాను క్రికెట్ సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు డీడీసీఎంకు నిధులు లేవని, తాను దాన్ని రూ.25 కోట్ల కార్పస్ ఫండ్ గా తీర్చి దిద్దానని, ఈ నిధులను క్రికెట్ పురోగతికి వినియోగించాలని ఆయన అన్నారు.