ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, సీజన్ మొత్తానికి దూరం కాగా... బయో బబుల్‌లో బతకలేనంటూ లియాన్ లివింగ్‌స్టోన్ స్వదేశానికి పయనమై వెళ్లిపోయాడు.

తాజాగా గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లాండ్, ఇండియా సిరీస్‌లో గాయంతో బరిలో దిగిన జోఫ్రా ఆర్చర్, వన్డే సిరీస్ సమయంలో శస్త్రచికిత్స కోసం స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే.

ఆర్చర్ చేతి వేలిలో ఉన్న గాజు ముక్కను వెలికి తీసిన వైద్యులు, సర్జరీ నిర్వహించారు.  ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆడకపోయినా, మధ్యలో ఆర్చర్ వస్తాడని భావించారు అభిమానులు.

అయితే ఆర్చర్ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో, ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి అతను అందుబాటులో ఉండడం లేదని ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.