దుబాయ్: టీమిండియా మాజీ సారథి, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో తనను పోల్చడం తగదని రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం సంజూ శాంసన్ అన్నారు. ఆయనలా మరే ఆటగాడు ఆడలేడని... ఆటను అనుకరించే ప్రయత్నం చేసినా సాధ్యం కాదని... అందువల్ల ఆ పని చేయడానికి ప్రయత్నించవద్దని సూచించారు. తనను కూడా ఇకపై ధోనీతో పోల్చవద్దని శాంసన్ అన్నారు. 

ప్రస్తుతం తన ఆటపై, కెరీర్ పైనే  ప్రత్యేక శ్రద్ద పెడుతున్నానని అన్నారు. ఆటను ఎలా మెరుగుపర్చుకోవాలి? తాను ప్రాతినిధ్యం వహించే జట్లకు పూర్తి స్థాయి సేవలు ఎలా అందించగలను, ఎలా గెలిపించగలను? టీమిండియాలో స్థిరమైన స్థానాన్ని ఎలా పొందగలను? అనే విషయాలపైనే తన దృష్టంతా వుందన్నారు. కాబట్టి ఇతర విషయాలపై చర్చను పక్కనపెట్టేయండని శాంసన్ సూచించారు. 

read more  క్రికెట్ లోనే కాదు లవ్ లోనూ సంజు శాంసన్ ది అదే దూకుడు

ఎప్పుడూ పాలిటిక్స్ తో బిజీగా వుండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సొంత రాష్ట్రం కేరళకు చెందిన ఆటగాడు సంజూ శాంసన్ ఐపిఎల్ సీజన్ 13లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 

గత ఆదివారం కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కొండంత లక్ష్యాన్ని(224 పరుగులు) రాజస్థాన్ రాయల్స్ చేధించింది. ఇందులో ప్రముఖ పాత్ర వహించాడు ఆ జట్టు ఆటగాడు శాంసన్. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని కొనియాడుతూ శశి థరూర్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. 

''రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 14ఏళ్ల వయసులో ఉన్నపుడే సంజు శాంసన్ ఆటను చూశాను. అప్పుడే ఏదో ఒకరోజు అతడు మరో ధోని అవుతాడని చెప్పాను. ఆ రోజు రానే వచ్చింది. ఐపిఎల్ సీజన్ 13లో రాయల్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ శాంసన్ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శన ద్వారా మరోసారి శాంసన్ ప్రపంచస్థాయి ఆటగాడినని నిరూపించుకున్నాడు'' అని థరూర్ అన్నారు. 

 అయితే శాంసన్ ని థరూర్ ధోనీతో పోల్చడంతో బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ కు చిర్రెత్తుకొచ్చినట్లుంది. దీంతో థరూర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అతడో ట్వీట్ చేశాడు. ''సంజూ శాంసన్ ఎవరితోనో పోల్చడం సరికాదు. అతడు  శాంసన్ గానే భారత  జట్టులో గుర్తింపు పొందుతాడు'' అంటూ గంభీర్ కౌంటరిచ్చారు. ఇలా తన ప్రదర్శనపై ఇద్దరు ఎంపీల మద్య వాడివేడి చర్చ సాగడంతో శాంసన్ కూడా ఆ విషయంపై తాజాగా స్పందించారు.

ఇక ఐపిఎల్ 2020 ఫ్యాన్స్‌కు కావాల్సినంత క్రికెట్ మజాను అందించింది రాజస్థాన్, పంజాబ్ మధ్య మ్యాచ్. 224 పరుగుల భారీ టార్గెట్ ను మరికొన్ని బంతులు మిగిలుండగానే ఛేదించింది రాయల్స్ జట్టు. ఇందుకోసం యువ ఆటగాడు సంజూ శాంసన్ అద్భుతంగా పోరాడాడు. 42 బంతుల్లోనే 85 పరుగులు(4 ఫోర్లు, 7 సిక్సర్లు) బాదాడు శాంసన్.