ఐపీఎల్ లో యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా గురించి ప్రస్తుతం క్రికెట్ ప్రియులందరికీ సుపరిచితమే. అతను ఆడే ఆట తీరు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒకప్పుడు కనీసం కాళ్లకు వేసుకోవడానికి బూట్లు కూడా లేని స్టేజ్ నుంచి ఐపీఎల్ లో అడుగుపెట్టిన అసమాన్యుడు.. ఈ చేతన్ సకారియా.

ఈ సంగతి పక్కన పెడితే.. చేతన్ సకారియా ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. చేతన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు సోదరుడిని కోల్పోగా.. తాజాగా.. తండ్రిని కోల్పోయాడు. ఇటీవల చేతన్ సకారియా తండ్రి కంజీ భాయ్ కి కరోనా సోకింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. గుజరాత్ లోని భావ్ నగర్ లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఆదివారం పరిస్థితి మరింత విషమించడంతో.. ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫాంచైజీ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సందర్భంగా తాము చేతన్ కి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కాగా.. చేతన్.. ఈ ఏడాది ఆరంభంలో తన సోదరుడిని కోల్పోయాడు. ఐపీఎల్ కు ఎంపిక అవ్వకముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో చేతన్ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే.. ఈ విషయాన్ని చేతన్ కి అతని కుటుంబసభ్యులు తెలియజేయకపోవడం గమనార్హం. అతను ట్రోఫీ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చాకే ఈ విషయం తెలిసింది. ఇక చేతన్ ఐపీఎల్ లో ఉన్న సమయంలోనే తండ్రి కరోనా బారిన పడ్డారని తెలుసుకున్నాడు. ఐపీఎల్ రద్దు కావడంతో.. ఇంటికి చేరుకొని తండ్రిని చూసుకుంటున్నాడు.ఐపీఎల్ లో వచ్చిన డబ్బుతోనే తండ్రికి చికిత్స కూడా చేయించాడు. కానీ.. ఫలితం దక్కకపోవడం బాధాకరం.