ఐపిఎల్ సీజన్ 12లో వరుస ఓటములతో సతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం జైపూర్ వేదికగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీలో మార్పులు చేపట్టింది. ఈ సీజన్ ఆరంభంనుండి కెప్టెన్ గా కొనసాగుతున్న అజింక్య రహానేను పక్కనబెట్టి జట్టు పగ్గాలను స్టీవ్ స్మిత్ చేతికి అందించారు. 

మరొకవైపు వ్యక్తిగత కారణాలతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్ కు స్టార్‌ ప్లేయర్ జోస్‌ బట్లర్‌ దూరమయ్యాడు. గర్భవతిగా వున్న బట్లర్‌ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అతడు స్వదేశానికి వెళ్ళిపోయాడు. దీంతో అతడు ఇవాళ్టి మ్యాచ్ కు దూరమయ్యాడు. 

 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రాజస్థాన్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచులాడగా అందులో ఆరింట్లో ఓటములను చవిచూసి కేవలం రెంబు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. దీంతో జట్టు కూర్పులో మార్పుచేర్పులు చేపట్టాలని భావించిన రాజస్థాన్ యాజమాన్యం ముందుగా కెప్టెన్సీ బాధ్యతల నుండి రహానేను తొలగించింది. కానీ అతన్ని జట్టులో మాత్రం చోటు కల్పించింది.