టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి శుభారంభం దక్కింది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ కలిసి మొదటి వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు... 
సీజన్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న బట్లర్, మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసిన జోస్ బట్లర్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ కూడా రాహుల్ చాహార్ బౌలింగ్‌లోనే అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

యశస్వి జైస్వాల్ అవుటయ్యే సమయానికి 9.4 ఓవర్లలో 91 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్, భారీ స్కోరు చేయడం ఖాయమని అనిపించింది. అయితే ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, శివమ్ దూబే నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో రన్‌రేట్ తగ్గింది.

27 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేసిన సంజూ శాంసన్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్ట్ అయ్యాడు. 148 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన శివమ్ దూబే, బుమ్రా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బుమ్రా తాను వేసిన 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.