ఐపిఎల్ సీజన్ 12కి కొద్దిరోజుల ముందు భారత్-ఆస్ట్రేలియా జట్ల మొహాలీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ ఆస్ట్రేలియన్ యువ కిలాడీ ఆస్టర్ టర్నర్ పేరు మారుమోగింది. భారత్ విసిరిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టర్నర్ మ్యాచ్‌లో ట‌ర్న్ చేసి వారి జ‌ట్టుకు విజ‌యాన్నందించాడు. ఇలా కేవలం 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు సాధించి తన సత్తాను చాటుకున్నాడు. అయితే అదే భారత గడ్డపై జరుగుతున్న ఐపిఎల్ లో మాత్రం రాణించలేక అత్యంత చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇలా ఇండియాలోనే పేరు సంపాదించుకుని మళ్లీ అక్కడే ఆ పేరును పొగొట్టుకుంటున్నాడు టర్నర్. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు తరపున ఇతడు ఎన్నో అంచనాల ఐపిఎల్ సీజన్ 12 ప్రారంభించాడు. అయితే రాజస్థాన్ జట్టు, అభిమానులు, యాజమాన్యం తనపై వుంచిన నమ్మకాన్ని ఇతడు నిలుపుకోలేకపోయాడు. ఇలా ఇతడు ఇప్పటివరకు ఐపిఎల్ లో మూడు సార్లు బరిలోకి దిగి మూడుసార్లూ డకౌటయ్యాడు. అలాగే బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇతడు ఆడిన చివరి రెండు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు. ఇలా వరుసగా ఐదు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో డకౌటవుతూ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

 కేవలం ఐపీఎల్‌ విషయానికొస్తే వరుసగా మూడు మ్యాచుల్లో డకౌటైన ఆటగాళ్లలో టర్నర్ ఆరోవాడు. అశోక్ దిండా, రాహుల్ శర్మ, గౌతమ్ గంభీర్, పవన్ నేగీ, శార్దూల్ ఠాకూర్‌లు ఇప్పటివరకు వరుసగా మూడు మ్యాచుల్లో పరుగులేవీ సాధించకుండానే డకౌటవగా తాజాగా టర్నర్ వారి సరసన చేరిపోయాడు.