Rahul Mankad Passes Away: టీమిండియా దిగ్గజ ఆటగాడు  వినూ మన్కడ్  చిన్న కుమారుడు రాహుల్ మన్కడ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా  గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న  రాహుల్.. బుధవారం లండన్ లో కన్నుమూశారు. 

భారత క్రికెట్ జట్టు తొలి తరం ఆటగాడు వినూ మన్కడ్ చిన్న కుమారుడు రాహుల్ మన్కడ్ కన్నుమూశారు. బుధవారం లండన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తాను కూడా క్రికెటర్ గానే కొనసాగిన రాహుల్ మన్కడ్.. 66 ఏండ్ల వయసులో కన్ను మూశారు. ముంబై రంజీ జట్టు తరఫున ఆడిన మన్కడ్ కు భార్యా ఇద్దరు పిల్లలున్నారు. జిగ్గా భాయ్ గా గుర్తింపు పొందిన రాహుల్.. భారత జట్టులో చోటు దక్కించుకోకపోయినా ముంబై రంజీ జట్టు తరఫున మాత్రం ఆడారు. రంజీలలో రెండు సార్లు ముంబైని విజేతగా నిలపడంంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

రంజీ కెరీర్ లో ముంబై తరఫున 47 మ్యాచులాడిన రాహుల్ మన్కడ్... 2,111 పరుగులు సాధించాడు. బౌలింగ్ లో 162 వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్.. రంజీలలో 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.

Scroll to load tweet…

1972 నుంచి 1985 వరకు ముంబై రంజీ జట్టులో భాగమైన రాహుల్.. తన తండ్రి వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్ (నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను బౌలర్ ఔట్ చేయడం)’ను నిషేధించాలని జీవితాంతం పోరాడారు. అయితే ఇటీవలే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్ ను నిషేధించి దానిని సాధారణ రనౌట్ గానే పరిగణించాలని తెలిపింది.

అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలు ఈ అక్టోబర్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే జీవితాంతం తన తండ్రి పేరు మీద ఉన్న మన్కడంగ్ ను నిషేధించాలని పోరాడిన రాహుల్.. ఆ నిబంధన అమలుకాకుండానే కన్నుమూయడం విషాదకరం. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. రాహుల్ మన్కడ్ మృతిపై పలవురు మాజీ క్రికెటర్లు తమ సంతాపం ప్రకటించారు. ముంబై టీమ్ మాజీ రంజీ ఆటగాడు, రాహుల్ తో కలిసి ఆడిన టి. సేకర్, ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ తో పాటు అమోల్ ఖర్హద్కర్ లు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. 

వినూ మన్కడ్ కు ముగ్గరు కొడుకులు.. అశోక్, అతుల్, రాహుల్. వీళ్లంతా క్రికెటర్లే కావడం గమనార్హం. అశోక్, అతుల్ లు ఇదివరకే మరణించగా.. ఇప్పుడు చిన్నవాడైన రాహుల్ కూడా తుది శ్వాస విడిచాడు.