టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత ముగియనున్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు... కొత్త కోచ్ నియామకం జరిగే వరకూ తాత్కాలిక కోచ్‌గా రాహుల్ ద్రావిడ్...

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో ముగియనుంది. దీంతో ఆ తర్వాత భారత జట్టు కోచ్ ఎవరనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు... శ్రీలంక టూర్‌లో భారత జట్టుకి కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా కోచ్‌గా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగింది.

అయితే ఎన్‌సీఏ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్‌కోచ్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది...అయితే రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త హెడ్‌కోచ్ నియామకం జరిగే వరకూ టీమిండియాకి తాత్కాలిక కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించబోతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం పూర్తిగా ఐపీఎల్, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ... టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించనుంది. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత నవంబర్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది టీమిండియా...

ఈ సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు బయలుదేరుతుంది. డిసెంబర్‌లో జరిగే సౌతాఫ్రికా పర్యటన సమయానికి కొత్త కోచ్ నియామకం పూర్తి అవుతుందని సమాచారం...