Rafael Nadal: గడిచిన కొంతకాలంగా గాయాలతో ఇబ్బందిపడుతున్న టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్.. త్వరలో జరుగబోయే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు.
ఎర్ర మట్టికోర్టు మహారాజు, టెన్నిస్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని దిగ్గజం రఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..? 2005 నుంచి అంతర్జాతీయ టెన్నిస్ కు అవిరామంగా సేవలందిస్తున్న స్పెయిన్ బుల్ తన కెరీర్ లో అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించనున్నాడా..? అంటే సమాధానం అవుననే వినిపిస్తున్నది. నాదల్ తాజా ప్రకటన కూడా అందుకు ఊతమిస్తున్నది.
గడిచిన కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న రఫెల్ నాదల్.. త్వరలో జరుగబోయే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. నాదల్ ఈ టోర్నీ ఆడేది అనుమానంగానే ఉందని రెండు మూడు నెలలుగా వస్తున్న అనుమానాలను నిజం చేస్తూ నాదల్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
త్వరలోనే మొదలుకాబోయే రోలండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్) నుంచి తాను తప్పుకుంటున్నట్టు నాదల్ తాజాగా ప్రకటించాడు. గురువారం స్పెయిన్ లోని తన అకాడమీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాదల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2005లో తన ఎంట్రీ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవడం నాదల్ కు ఈ 18 ఏండ్లలో ఇదే ప్రథమం. 18 ఏండ్లలో నాదల్ ఏకంగా 14 సార్లు రోలంగ్ గారోస్ విజేతగా నిలిచాడు. గతేడాది కూడా నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన విషయం విదితమే.
తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ లను సాధించిన నాదల్.. రెండేండ్ల క్రితం కాలికి గాయంతో సుమారు ఏడాదికాలం పాటు ఆటకు దూరమయ్యాడు. కానీ 2022లో ఆస్ట్రేలియా ఓపెన్ తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ కూడ నెగ్గి కెరీర్ లో 22వ గ్రాండ్ స్లామ్ నెగ్గాడు. ఇక గతేడాది వింబూల్డన్ సందర్భంగా గాయపడ్డ నాదల్.. త్వరగానే కోలుకుని యూఎస్ ఓపెన్ లో బరిలోకి దిగాడు. యూఎస్ ఓపెన్ సందర్భంగా థర్డ్ రౌండ్ లో మళ్లీ గాయపడ్డ నాదల్ ఆ తర్వాత మళ్లీ టెన్నిస్ కోర్టులోకి దిగలేదు. గాయం కారణంగా నాదల్.. పారిస్, బార్సిలోనా టోర్నీలకు దూరమయ్యాడు.
రిటైర్మెంట్..
నిత్యం గాయాల బారిన పడుతున్న నాదల్.. 2024 మొదట్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తున్నది. రోలాండ్ గారోస్ నుంచి నిష్క్రమించినట్టు ప్రకటించగానే నాదల్ ఇందుకు హింట్ కూడా ఇచ్చాడని టెన్నిస్ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.
