Quaid-e-Azam Trophy: ఖైద్ ఏ ఆజామ్ ట్రోఫీ సందర్భంగా ఫంక్తువా, నార్తర్న్ జట్లు డిసెంబర్ 25న ఫైనల్  ఆడాల్సి ఉంది.  ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఉండటానికి పీసీబీ.. స్థానికంగా ఉన్న ఓ హోటల్ ను బుక్ చేసింది. 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్లక్ష్యానికి యువ క్రికెటర్లు బలయ్యారు. సరైన సమయంలో స్పందించడంలో విఫలమైన పీసీబీ నిర్లక్ష్యం మూలం.. ఆ క్రికెటర్లను వీధిలో పడేసింది. దీంతో కీలక మ్యాచ్ కు ముందు రెండు జట్ల ఆటగాళ్లు వణికించే చలిలో చీకటి వీధుల్లో బలిపశువులయ్యారు. ఖైద్ ఏ ఆజామ్ ట్రోఫీ సందర్భంగా పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో కీలక జట్లైన ఖైబర్ ఫంక్తువా, నార్తర్న్ ఆటగాళ్ల పరిస్థితి ఇది. అసలేం జరిగిందంటే...? 

ఖైద్ ఏ ఆజామ్ ట్రోఫీ సందర్భంగా ఫంక్తువా, నార్తర్న్ జట్లు డిసెంబర్ 25న ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఉండటానికి పీసీబీ.. కరాచీలోని స్థానికంగా ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను బుక్ చేసింది. అయితే ఆ కాంట్రాక్టు నిన్నటికే (డిసెంబర్ 22) ముగిసింది. దానిని మళ్లీ పునరుద్దరించడంలో పీసీబీ నిర్లక్ష్యం వహించింది. 

Scroll to load tweet…

దీంతో నిన్న రాత్రి సదరు హోటల్ సిబ్బంది.. ఫంక్తువా, నార్తర్న్ ల క్రికెటర్లను హోటల్ నుంచి పంపించారు. వాళ్ల బ్యాగులు, క్రికెట్ కిట్లు, ఇతర సామాగ్రిని హోటల్ లో నుంచి తీసి బయటపడేశారు. దీంతో ఆ రెండు జట్ల ఆటగాళ్లంతా రాత్రి ఎముకలు కొరికే చలిలోనే గడిపారు.

అయితే పీసీబీకి చెందిన అధికారులు హోటల్ సిబ్బందితో మాట్లాడిన వాళ్లు వినలేదని స్థానిక వార్తా పత్రికలు వెల్లడించాయి. పాత బుకింగ్ క్యాన్సిల్ చేసిన తర్వతే కొత్త బుకింగ్ తీసుకుంటామని, అప్పటిదాకా ఆటగాళ్లను మాత్రం హోటల్ లో ఉండనివ్వబోమని వాళ్లు తేల్చి చెప్పడంతో రెండు జట్ల క్రికెటర్లకు ఆ రాత్రి కాలరాత్రే అయింది. హోటల్, పీసీబీ ల మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని బోర్డుకు సంబంధించిన ఓ వ్యక్తి పేర్కొన్నాడు. 

ఇదిలాఉండగా.. క్రికెటర్లు వీధుల్లో ఉన్నారని తెలిసిన పీసీబీ చాలా ఆలస్యంగా మేలుకుంది. వారిని పక్కనే ఉన్న త్రీస్టార్ హోటల్ కు మార్చింది. బయో బబుల్ నిబంధనలు పక్కనబెట్టి మరీ పీసీబీ ఈ విధంగా వ్యవహిరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా కూడా ఆ త్రీ స్టార్ హోటల్ లోనే బస చేస్తుండటం గమనార్హం. 

కాగా.. ఇటీవల చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ వెటరన్ షోయబ్ మాలిక్ మేనల్లుడు మహ్మద్ హురైరా.. నార్తర్న్ జట్టులో సభ్యుడే. నార్తర్న్ తరఫున ఆడుతున్న సియాల్కోట్ హీరో హురైరా.. 314 బంతులు ఎదుర్కుని 300 పరుగులు సాధించాడు. మొత్తంగా అతడు.. 341 బంతుల్లో 311 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి మారథాన్ ఇన్నింగ్సులో 40 బౌండరీలు, 4 సిక్సర్లున్నాయి. పాక్ దిగ్గజం మియాందాద్ తర్వాత.. అతి చిన్న వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించింది హురైరానే కావడం విశేషం.