FIFA: చివరి నిమిషంలో షాకిచ్చిన ఖతర్.. మందుబాబులకు ఊహించని ట్విస్ట్
FIFA World Cup 2022: వివాదాలు, విమర్శల నడుమ ఖతర్ వేదికగా జరుగబోతున్న ఫిఫా ప్రపంచకప్ మరోసారి వార్తల్లో నిలిచింది. మందుబాబుల ఆశలపై ఖతర్ నీళ్లు చల్లింది.
ఖతర్ వేదికగా నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అరబ్బుల దేశంలో ఖతర్ ను నిర్వహించడంపై ప్రపంచవ్యాప్తంగా (ముఖ్యంగా యూరోపియన్ దేశాల నుంచి) తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రదాయియ ముస్లింవాద దేశమైన ఖతర్ లో ప్రపంచకప్ నిర్వహించడం ఫిఫా చేసిన తప్పిదమనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి కొనసాగింపా.. అన్నట్టు ఖతర్ ప్రభుత్వం తీసుకున్న చర్య కూడా విమర్శలకు తావిచ్చింది. తాజాగా అక్కడి ప్రభుత్వం ప్రపంచకప్ మ్యాచ్ లు జరిగే స్టేడియాలలో ‘బీర్’ అమ్మకాలపై నిషేధం విధించింది.
వాస్తవానికి ఖతర్ లో బహిరంగ మద్యపానం నిషేధం. కానీ ప్రపంచకప్ నేపథ్యంలో దానిలో కొంత సడలింపులు ఇచ్చారు. స్టేడియాలలో, ఫ్యాన్ జోన్ లలో అభిమానులు మందు (బడ్వైజర్ బీర్లు మాత్రమే) తాగేందుకు అవకాశమిచ్చారు. కానీ ఉన్నట్టుండి ప్రపంచకప్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఖతర్ ప్రభుత్వం దీనిపైనా నిషేధం విధించింది.
ఫుట్‌బాల్ మ్యాచ్ లు జరిగే స్టేడియాలలో బీర్లు తాగడం నిషిద్ధమని.. ఫ్యాన్ జోన్ లలో మాత్రం అదీ సాయంత్రం వేళల్లో అందుకు అనుమతి ఉందని తాజాగా పేర్కొంది. ఫ్యాన్స్ ఖరీదైన హోటల్స్, బార్లలో మందు తాగడానికి ఆస్కారముంది గానీ మ్యాచ్ జరిగే స్టేడియాలలో మాత్రం మందు నిషిద్ధమని తెలిపింది.
కొద్దిరోజుల ముందు ఖతర్ ప్రభుత్వం.. ఈ టోర్నీ నేపథ్యంలో అక్కడ మ్యాచ్ లు జరిగే స్టేడియాలు, ఫ్యాన్ జోన్ లలో ‘బడ్వైజర్’ బీర్స్ తాగడానికి అనుమతినిచ్చింది. ఫ్యాన్ జోన్ లలో ఈవినింగ్ మాత్రమే తాగాలి. పొద్దస్తమానం తాగుతామంటే కుదరదు. కాగా ఫిఫా ప్రపంచకప్ దృష్ట్యా తాగి రోడ్లమీదకు వచ్చేవారిని చూసీ చూడనట్టు వ్యవహరించాలని ఖతర్ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. రోడ్లమీద తాగేవారిని ఉపేక్షించేదే లేదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఖతర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఫిఫా అధ్యక్షుడు జియాన్ని ఇన్ఫాంటినో మాత్రం సమర్థించుకున్నారు. మ్యాచ్ జరిగే మూడు గంటల్లో తాగకపోతే వచ్చే నష్టమేమీ లేదని.. ఆ తర్వాత ెలాగూ తాగుతారు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.