కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టులో అత్యంత ఆకతాయి ఎవరో ఆ జట్టు యువ క్రికెటర్ లోకేశ్ రాహుల్ బయటపెట్టారు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ డ్రెస్సింగ్ రూంలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని పేర్కొన్నాడు. తోటి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ అతడు డ్రెస్సింగ్ రూంలో నవ్వులు పూయిస్తాడని అన్నారు. అతడి వల్ల పంజాబ్ ఆటగాళ్లు సూపర్ ఫన్ పొందుతారని....  దీంతో మా డ్రెస్సింగ్ రూం ఎప్పుడూ ఆహ్లదకరంగా వుంటుందని రాహుల్ తెలిపాడు.

పంజాబ్ జట్టు తరపున ఈ వెస్టిండిస్ ఆటగాడితో కలిసి లోకేశ్ రాహుల్ ఓపెనర్ గా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో గేల్ తనను ఓ జూనియర్ ఆటగాడిగా కాకుండా ఓ మంచి స్నేహితుడిగా చూసుకుంటాడని రాహుల్ తెలిపాడు. ఆటగాడిగా  మైదానంలో విరుచుకుపడే గేల్ డ్రెస్సింగ్ రూంలో మాత్రం మంచి ఫన్ని గయ్ అని తెలిపాడు. ఈ విండీస్ ఆటగాడి ఎనర్జీ వయస్సు పెరుగుతున్న కొద్ది పెరుగుతున్నట్లుందని రాహుల్ అన్నాడు. 

గేల్ గురించి రాహుల్ ఏమన్నాడో అతడి మాటల్లోనే తెలుసుకుందాం. '' గేల్ టీ20 క్రికెట్లో అద్భుతమైన ఆటగాడు. ఇలా మైదానంలో బంతిని కోపంగా బాదుతున్నంత మాత్రాన అతడు ఎప్పుడూ సీరియస్ గా వుంటాడని అనుకుంటే పొరపడినట్లే. అతడు మైదానంలో బ్యాట్ తో ఎలా రెచ్చిపోతారో డ్రెస్సింగ్ రూంలో అంతకంటే సరదాగా వుంటారు. సీనియర్ ఆటగాడినన్న గర్వాన్ని అస్సలు ప్రదర్శించడు.  మరీ ముఖ్యంగా తనలాంటి యువ ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తనను ఎప్పుడూ కాళ్లు పట్టి లాగుతుంటాడు.  డ్రెస్సింగ్ రూంలో గేల్ సరదా, చిలిపి చేష్టలతో ఎప్పుడూ నవ్వులు పూయిస్తాడు'' అని రాహుల్ వెల్లడించాడు. 

దిగ్గజ ఆటగాడు గేల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అరుదైన అవకాశం తనకు రావడం అదృష్టమన్నాడు. అతడి నుండి క్రికెట్ కు సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నానని...అతడితో కలిసి ఆటడాన్ని ఆస్వాదిస్తానని రాహుల్ అన్నాడు. 

గేల్ తో ఏర్పడిన సాన్నిహిత్యంతో తనకో విషయం అర్థమయ్యిందని రాహుల్ అన్నాడు. అతడికి వ్యక్తిగల లక్ష్యాలంటూ ఏమీ లేవని...రానున్న వరల్డ్ కప్ గురించి అతడు ఆలోచించడంలేదు...కానీ ఐపిఎల్ లో తమ జట్టు గెలుపు గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇలా కమిట్ మెంట్ తో ఐపిఎల్ ఆడుతున్న ఆటగాడు గేల్ అని లోకుశ్ రాహుల్ అభిప్రాయపడ్డారు.