Asianet News TeluguAsianet News Telugu

సచిన్ టెండూల్కర్‌ని సాయం కోరిన విండీస్ లెజెండ్... ముందుకొచ్చిన పూమా...

కుర్రాళ్లకు పంచేందుకు క్రికెట్ కిట్స్ ఇవ్వాల్సిందిగా సచిన్ టెండూల్కర్‌ని కోరిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్... సానుకూలంగా స్పందించిన పూమా కంపెనీ... 

Puma Cricket responds to Benjamin request to Sachin Tendulkar for cricket kits
Author
India, First Published Aug 13, 2022, 1:47 PM IST

కొన్ని దశాబ్దాల క్రితం క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన జట్టు వెస్టిండీస్. అరవీర భయంకర బౌలర్లు, విధ్వంసకర బ్యాటర్లు నిండిన వెస్టిండీస్‌తో ఆడాలంటేనే ప్రత్యర్థి క్రికెటర్లు భయపడేవాళ్లు. అయితే 1983 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఓడిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది...

లెజెండరీ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోజురోజుకీ వెస్టిండీస్ జట్టు బలహీనంగా మారడం తయారైంది. బ్రియాన్ లారా, క్రిస్ గేల్, కిరన్ పోలార్డ్ వంటి ప్లేయర్లతో పేపర్ మీద అత్యంత పటిష్టంగా కనిపిస్తున్నా, విజయాలు అందుకోవడంలో మాత్రం వెస్టిండీస్ చాలా కష్టపడాల్సిన పరిస్థితి...

ఆర్థిక మాంద్యం కారణంగా వెస్టిండీస్ బోర్డు ఆర్థిక కష్టాలను కూడా ఎదుర్కొంటోంది. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వింస్టన్ బెంజిమెన్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ని సాయం కోరాడు. తనకు కొన్ని క్రికెట్ కిట్స్ ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు....

‘మిస్టర్ టెండూల్కర్, దయచేసి నాకు సాయం చేయ్యాలి. మా కుర్రాళ్లుకు సరైన గైడెన్స్ ఇచ్చేందుకు కొన్ని క్రికెట్స్ కావాలి...’ అంటూ తన ఫోన్ నెంబర్‌ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు వింస్టన్ బెంజిమన్. విండీస్ మాజీ క్రికెటర్ విన్నపానికి సచిన్ టెండూల్కర్ స్పందించలేదు..

‘థ్యాంక్యూ మహ్మద్ అజారుద్దీన్.. అతను కొన్ని క్రికెట్ కిట్స్‌ని నాకు పంపాడు. ధన్యవాదాలు.. అజార్. ఎవ్వరైనా సాయం చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి... ’ అంటూ మరోసారి సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించాడు బెంజిమన్...

‘షార్జాలో ఓ టోర్నీమెంట్ పెట్టి, వివిధ దేశాల ప్లేయర్లతో బెనిఫిట్ గేమ్ ఆడేవాళ్లం. ఇప్పుడు ఆ బెనిఫిట్ మేం పొందాలని అనుకోవడం లేదు. మాకు కావాల్సిందల్లా ఓ 10-15 బ్యాట్లు, క్రికెట్ కిట్స్ మాత్రమే. నాకు 20 వేల అమెరికన్ డాలర్లు అవసరం లేదు. కేవలం పిల్లకు ఇచ్చేందుకు క్రికెట్ బ్యాట్స్ చాలు...’ అంటూ యూట్యూబ్ వీడియో ఛానెల్ ద్వారా అభ్యర్థించాడు బెంజిమెన్.

తాజాగా స్పోర్ట్స్ పరికరాల తయారీ కంపెనీ, ప్రముఖ స్పోర్ట్స్ షూ కంపెనీ పూమా, బెంజిమన్ అభ్యర్థనకు స్పందించింది. ‘మేం నీ అభ్యర్థనను విన్నాం.. వింస్టన్. ఈ పిల్లలకు కిట్స్ ఇచ్చేందుకు నీతో చేతులు కలుపుతున్నాం...’ అంటూ రిప్లై ఇచ్చింది పూమా క్రికెట్...

రిప్లై ఇచ్చిన కొద్దిసేపటికే క్రికెట్ కిట్స్ ప్యాక్ చేసి పంపుతున్నట్టుగా ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది పూమా క్రికెట్. పూమా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతా బాగానే ఉన్నా, బెంజిమన్ ఎవ్వరినైతే ముందుగా సాయం కోరాడో ఆ సచిన్ టెండూల్కర్ ఇప్పటిదాకా విండీస్ మాజీ క్రికెటర్ అభ్యర్థనకు స్పందించకపోవడం విశేషం..  

Follow Us:
Download App:
  • android
  • ios