PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో భాగంగా లాహోర్ కలాండర్స్ టీమ్ సారథి షాహీన్ షా అఫ్రిది రీఎంట్రీ లో అదరగొట్టాడు. అతడు వేసిన వేగానికి బ్యాట్ రెండు ముక్కలైంది.
పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తెను ఇటీవలే వివహమాడిన యువ సంచలనం షాహీన్ షా అఫ్రిది.. పీఎస్ఎల్ లో తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. అతడు బంతి విసిరిన వేగానికి ప్రత్యర్థి జట్టు బ్యాటర్ బ్యాట్ రెండు ముక్కలైంది. తొలి బంతికి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సదరు బ్యాటర్.. రెండో బంతికి మాత్రం క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వివరాల్లోకెళ్తే.. పీఎస్ఎల్ - 2023లో భాగంగా ఆదివారం లాహోర్ కలాండర్స్ - పెషావర్ జల్మీల మధ్య మ్యాచ్ జరిగింది. పెషావర్ బ్యాటింగ్ కు వచ్చిన క్రమంలో షాహీన్ షా రీఎంట్రీలో తన వాడిని చూపించాడు. పెళ్లి తర్వాత తాను ఆడుతున్న తొలి మ్యాచ్ తొలి ఓవర్ లోనే అతడు నిప్పులు చెరిగాడు.
అఫ్రిది వేసిన తొలి బంతి వేగానికి పెషావర్ జల్మీ ఓపెనర్ మహ్మద్ హారీస్ బ్యాట్ రెండు ముక్కలైంది. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా అఫ్రిది బంతిని విసరగా దానిని హారీస్ డ్రైవ్ చేయబోయాడు. కానీ బంతి వేగానికి బ్యాట్ విరిగిపోయింది. ఆ తర్వాత బంతికే హారీస్ ను అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ కలాండర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఫకర్ జమాన్.. (45 బంతుల్లో 96, 3 ఫోర్లు, 10 సిక్సర్లు) రెచ్చిపోయాడు. షఫీక్ (41 బంతుల్లో 75, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా వీరవిహారం చేశాడు. వీరికి తోడు వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పెషావర్ కూడా ధాటిగానే ఆడింది. 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బాబర్ (5) విఫలమైనా సయీమ్ అయూబ్ (51), కాడ్మోర్ (55), భానుక రాజపక్స (24), రొవ్మన్ పావెల్ (20) లు పోరాడారు. షాహీన్ అఫ్రిది నాలుగు ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా లాహోర్ 40 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
