దేశ రాజధాని న్యూడిల్లీ వేదికన జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రో కబడ్డి లీగ్ 2019లో యూపీ యోదాస్ అదరగొట్టింది. ప్రత్యర్థి పుణేరీ పల్టాన్ ను చిత్తుచేసి కేవలం 5పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పుణేరీ స్టార్ రైడర్ మంజీత్ 16 పాయింట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేసినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. యూపీ తరపున శ్రీకాంత్ జాదవ్ 15 పాయింట్లతో రాణించాడు.   

యూపీ జట్టు రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 1 ఇలా మొత్తం 35 పాయింట్లు  సాధించింది. ఆటగాళ్లలో శ్రీకాంత్ 15 పాయింట్లతో పాటు సురేందర్ గిల్ 5, సుమిత్ 5, అశు 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇలా ఆటగాళ్లు సమిష్టిగా పోరాడి పుణేరీ జట్టును ఓడించగలిగారు.

ఇక పుణేరీ పల్టాన్స్ విషయానికి వస్తే రైడింగ్ లో 19, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల ద్వారా 1  మొత్తం 30 పాయింట్లు మాత్రమే సాధించింది.  ఆటగాళ్ళలో మంజీత్ 16 పాయింట్లతో చెలరేగి టాప్ స్కోరర్ గా నిలిచినా ఫలితం  లేకుండా పోయింది. జాదవ్ 4, అమిత్ 3, పంకజ్ 2, శుభమ్ 2 పాయింట్లు మాత్రమే  చేశారు. మిగతా ఆటగాళ్లెవరూ కనీస పాయింట్లు కూడా సాధించడంలో విఫలమయ్యారు. దీంతో 35-30 పాయింట్ల తేడాతో యూపీ యోదాస్ విజయం సాధించింది.