ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హోం గ్రౌండ్ గచ్చిబౌలిలో  ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓడిన టైటాన్స్ ముంబై లో మాత్రం మొదటి మ్యాచ్ లోనే విజయాన్ని అందుకుంది. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో యూపి యోదాస్ తో తెలుగు టీం నువ్వా నేనా అన్నట్లుగా తలపడింది. అయితే చివరి క్షణంలో ఇరు జట్లు 19-19 పాయింట్లతో సమానంగా వున్నపుడు టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ మాయ చేశాడు. కూతకు వెళ్లి సక్సెస్‌ఫుల్ గా ఓ పాయింట్ సాధించి తెలుగు జట్టుకు ఈ సీజన్లో మొదటి విజయాన్ని అందించాడు. 

తెలుగు టైటాన్స్ జట్టు రైడర్స్, డిఫెండర్స్ సమిష్టిగా రాణించడంతో ఈ విజయం సాధ్యమయ్యింది. మొదటి నుండి ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. అయితే టైటాన్స్ రైడర్స్ కాస్త పైచేయి  సాధించి 9 పాయింట్లు రాబట్టుకోగా యూపీ  రైడర్స్ మాత్రం కేవలం 3 పాయింట్లు మాత్రమే సాధించారు. డిపెండర్స్  విషయానికి యూపి 13, టైటాన్స్ 10 ట్యాకిల్ పాయింట్లు సాధించాయి. ఇక ఇరు జట్లకు ఓ అదనపు పాయింట్ లభించడంతో తెలుగు టైటాన్స్ 20, యూపీ యోదాస్ 19 పాయింట్ల వద్ద నిలిచాయి. ఇలా కేవలం చివర్లో సిద్దార్థ్ సాధించిన ఒకే ఒక్క పాయింట్లు తెలుగు టైటాన్స్ కు విజయాన్ని కట్టబెట్టింది. 

తెలుగు టీం ఆటగాళ్లలో సిద్దార్థ్ దేశాయ్ 5, ఫహద్ 4, అబోజర్ 4, సూరజ్ దేశాయ్ 3 పాయింట్లతో  ఆకట్టుకున్నారు. ఇక అరుణ్ 2, విశాల్ భరద్వాజ్ 1 పాయింట్ తో టైటాన్ విజయానికి తమ వంతు సహకారం అందించారు. 

ఇక యూపీ విషయానికి వస్తే అమిత్ 4, శ్రీకాంత్ 4, నితేశ్ 4 పాయింట్లతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మోనే గోయట్ 2, సుమిత్ 2, ఆశు 1, సచిన్ 1 పాయింట్ సాధించినప్పటికి తమ  జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.