ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 తెలుగు టైటాన్స్ మరో విజయాన్ని అందుకుంది. వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్స్ పట్టిక చివర్లో నిలిచిన టైటాన్స్ జట్టుకు ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది. టైటాన్స్ స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. అతడొక్కడే ఏకంగా 18 పాయింట్లతో చెలరేగి టైటాన్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

టైటాన్స్ జట్టు 40 పాయింట్లు సాధిస్తే అందులో 18 సిద్దార్థ్ దేశాయ్ సాధించినవే. దీన్ని బట్టే అతడి విధ్వంసం ఏ స్థాయిలో చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ ఆరంభం నుండి కసితో ఆడిన అతడు ప్రత్యర్థి డిఫెండర్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా రైడ్ కు వెళ్లిన ప్రతిసారి సక్సెస్‌ఫుల్ తిరిగివచ్చి సత్తా చాటాడు. దీంతో ఇప్పటివరకు జరిగిన ఈ  టోర్నీలో మొదటిసారి టైటాన్స్ జట్టు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. 

మిగతా ఆటగాళ్ల  విషయానికి వస్తే సూరజ్ దేశాయ్ 6, అబోజర్ 3, విశాల్ 3, పర్హాద్ 2, అరుణ్ 2 పాయింట్లతో పరవాలేదనిపించారు. ఇలా రైడింగ్ లో 24, ట్యాకిల్స్ లో 10, ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 2 మొత్తం 40 పాయింట్లు సాధించి టైటాన్స్ విజయాన్ని అందుకుంది. 

హర్యానా జట్టు రైడింగ్ లో 22 పాయింట్లతో టైటాన్స్ కు గట్టి పోటీ ఇచ్చినా ట్యాకిల్స్ లో మాత్రం కేవలం 3 పాయింట్లతో తేలిపోయింది. సూపర్ రైడ్ ద్వారా 1, ఎక్స్‌ట్రాల రూపంలో 4 పాయింట్లు సాధించినప్పటికి టైటాన్స్ ను అందుకోలేకపోయింది. ఆటగాళ్లలో వికాస్ 9, నవీన్ 6, వినయ్ 4, ప్రశాంత్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నా హర్యానాకు విజయాన్ని  మాత్రం అందించలేకపోయారు.  ఇలా 40-29  పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ పై తెలుగు టైటాన్స్ విజయాన్ని సాధించింది.