ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో యూ ముంబా మరో ఓటమిని చవిచూసింది. చెన్నైలోని జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ జట్టు అదరగొట్టింది. స్టార్ రైడర్ వికాస్ ఖండోలా చెలరేగి 9 పాయింట్లతో ఆదుకోవడంతో హర్యానా విజయం సాధ్యమయ్యింది. కేవలం 3 పాయింట్లు  తేడాతో ముంబైని మట్టికరిపించిన స్టీలర్స్ జట్టు  పాయింట్స్ పట్టికలో ముందుకు దూసుకుపోయింది. 

హర్యానా ఆటగాళ్ల వికాస్ ఒక్కడే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మిగతావాళ్లలో రవి కుమార్ 3, సునీల్ 3, చాంద్ సింగ్ 3, సెల్వమణి 3 పాయింట్లతో పరవాలేదనిపించారు. ఓ సూపర్ రైడ్ తో కలుపుకుని మొత్తం రైడింగ్ లో 17, ట్యాకిల్స్ లో 9, ప్రత్యర్థిని  ఓసారి ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 3 ఇలా మొత్తం 30 పాయింట్లు సాధించింది.

ముంబై జట్టు చివరివరకు గట్టి పోటీనిచ్చినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ జట్టు రైడింగ్ లో 14, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1 పాయింట్లతో మొత్తంగా 27 పాయింట్లు సాధించింది. అయినప్పటికి కేవలం 3 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 

ముంబై ఆటగాళ్లలో అభిషేక్ సింగ్ 6, సందీప్ నర్వాల్ 5, ఫజల్ 4 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇక అర్జున్ 3, అతుల్ 3, హరీందర్ 2 పాయింట్లతో పరవాలేదనిపించారు. ఇలా ముంబై జట్టు చివరివరకు పోరాడినప్పటికి 30-27 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.