ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో మరో రసవత్తర పోరుకు చెన్నైలోని జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికయ్యింది. బెంగాల్ వారియర్స్ దెబ్బకు పాట్నా పైరేట్స్ చిత్తయ్యింది. వారియర్స్ రైడర్స్, డిఫెండర్స్ సమిష్టిగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. పాట్నా స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. 

బెంగాల్ వారియర్స్ జట్టు రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 11, ఆలౌట్ల ద్వారా 4 ఇలా మొత్తం 35 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో మణిందర్ 10 పాయింట్లతో చెలరేగగా  ప్రభంజన్ 6, రింకు 5, ఇస్మాయిల్ 4, జీవ కుమార్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇక బల్దేవ్ 2, సుఖేష్ 1 పాయింట్ సాధించారు. ఇలా ఆటగాళ్లందరు సమిష్టిగా రాణించడంతో బెంగాల్ మరో విజయాన్ని అందుకుని పాయింట్స్ పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 

పాట్నా పేరేట్స్ మాత్రం ఈ సీజన్లో మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ జట్టు రైడింగ్ లో 18 పాయింట్లతో బెంగాల్ కు మంచి పోటీనిచ్చిన ట్యాకిల్స్ విషయంలో తేలిపోయింది. డిఫెండర్స్ విఫలమవడంతో కేవలం 6 ట్యాకిల్ పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.  ఆలౌట్ ద్వారా  మరో 2 పాయింట్లు అందుకున్నా 26 పాయింట్లవద్దే ఆగిపోయింది. 

పైరేట్స్ ఆటగాళ్లలో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 12 ఒక్కడే అద్భుతంగా ఆడాడు. మిగతావారిలో ఎవరూ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంతో పాట్నా జట్టుకు మరో ఓటమి తప్పలేదు. ఇలా 35-26 పాయింట్ల తేడాతో పైరేట్స్ పై బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది.