టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్-ఏ జట్టు తరపున ఆడుతున్న పృథ్వీ షా... తన బ్యాటింగ్ తో విజృంభించాడు. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన రెండో వన్డే వార్మప్‌ మ్యాచ్‌లో పృథ్వీ షా 150  పరుగులు సాధించాడు. గాయాలతో సతమవుతున్న పృథ్వీ షా.. కివీస్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అయితే రెండో వన్డే వార్మప్‌ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు.

పృథ్వీ షాతోపాటు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా సత్తా చాటడం గమనార్హం. వీరిద్దరూ భారీ స్కోర్ చేధించారు. భారత్-ఏ జట్టు 372 పరుగుల భారీ స్కోర్  చేధించారు. ఈ మ్యాచ్ లో తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న పృథ్వీ షా సెలక్టర్ల కంట్లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read 9 వేల పరుగుల మైలు రాయి దాటిన రోహిత్ శర్మ...

న్యూజిలాండ్‌లో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌ కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలో ఎంపిక చేయనుంది. పృథ్వీ షా తాజా ప్రదర్శనతో అతన్ని న్యూజిలాండ్‌ టెస్టు జట్టులో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌లు ఓపెనర్ల బెర్తులు ఖాయం చేసుకున్నారు. ఇక మూడో ఓపెనర్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. వన్డే, టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ను టెస్టు టీమ్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి సెలక్టర్లు ఏం చేస్తారో చూడాలి.