Ranji Trophy 2022-23: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా  జాతీయ జట్టుకు ఎంపిక కాకున్నా   దేశవాళీలో మాత్రం అదరగొడుతున్నాడు. వరుస బెట్టి సెంచరీలు బాదుతున్నాడు.  తాజాగా రంజీ ట్రోఫీలో భాగంగా ట్రిపుల్ సెంచరీ చేసి  రికార్డులు బద్దలుకొట్టాడు. 

ముంబై యువ ఆటగాడు  పృథ్వీ షా దేశవాళీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా  ముంబై-అసోం మధ్య జరుగుతున్న  మ్యాచ్ లో  పృథ్వీ.. ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు.  383 బంతుల్లోనే  ఏకంగా 49 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో  379 పరుగులు చేశాడు.  ఫోర్లు, సిక్సర్ల ద్వారా  వచ్చిన పరుగులే 220 కావడం విశేషం.  నిన్న గువహతి వేదిగకా ప్రారంభమైన మ్యాచ్ లో  107 బంతుల్లో సెంచరీ చేసిన షా.. తర్వాత వంద పరుగులకు 128 బంతులు తీసుకున్నాడు. ఇక ట్రిపుల్ సెంచరీకి  మరో 91 బంతులే అవసరమయ్యాయి.   

ట్రిపుల్ సెంచరీ సాధించిన షా.. క్వాడ్రపుల్ (400) మీద కూడా కన్నేశాడు. కానీ  రియాన్ పరాగ్ వేసిన 126వ ఓవర్లో  ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  క్వాడ్రపుల్ సెంచరీ మిస్ అయినా షా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. రంజీలలో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో షా రెండో స్థానంలో నిలిచాడు.  

రంజీ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లలో బి.బి. నింబాల్కర్ తొలి స్థానంలో ఉన్నారు. నింబాల్కర్..  1948-49లో కథియావార్ పై ఆడిన రంజీ మ్యాచ్ లో 443 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. రంజీ చరిత్రలో  క్వాడ్రపుల్ సెంచరీ చేసిన రికార్డు ఇప్పటిదాకా ఆయన పేరు మీదే చెక్కు చెదరకుండా ఉంది. నింబాల్కర్ భారత జాతీయ జట్టుకు ఆడకపోయినా  దేశవాళీలో మాత్రం రాణించాడు. 

నింబాల్కర్ తర్వాత సంజయ్ మంజ్రేకర్ (1990-91 సీజన్ లో హైదరాబాద్ పై 379), ఎం.వి.శ్రీధర్  (1993-94లో  ఆంధ్రాపై 366), విజయ్ మర్చంట్ (మహారాష్ట్రపై 1943-44లో 359నాటౌట్),   సమిత్ గోహెల్ (ఒడిషాపై 2016-17లో 359 నాటౌట్), వీవీఎస్ లక్ష్మణ్ (కర్నాటకపై 1999-2000లో 353), ఛటేశ్వర్ పుజారా (కర్నాటకపై 2012-13 లో 352), స్వప్నీల్ గుగలె (ఢిల్లీపై 2016-17లొ  351 నాటౌట్), పునీత్ బిష్త్ (సిక్కీంపై 2018-19లో 343), సకిబుల్ గని (మిజోరంపై 2121-22 లో 341), సునీల్ గవాస్కర్ (1981-82లో బెంగాల్ పై 340) ఉన్నారు. ఇప్పుడు  పృథ్వీ షా ఈ రికార్డులన్నీ బ్రేక్ చేశాడు.  నింబాల్కర్ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 

 

Scroll to load tweet…

దేశవాళీలో  రంజీలతో పాటు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో, వివిధ టోర్నీలలో రాణిస్తున్నా బీసీసీఐ షా పై  కరుణ చూపడం లేదు.  ప్రతీ సిరీస్ సెలక్షన్స్ లోనూ అతడికి నిరాశే ఎదురవుతున్నది. మరి తాజాగా ట్రిపుల్ సెంచరీతో అతడు తన ఉద్దేశాన్ని గట్టిగానే చాటాడు. మరి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో పృథ్వీ షా కు ఛాన్స్ దొరుకుతుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి. 

 

Scroll to load tweet…