యంగ్ ఓపెనర్ పృథ్వీషా... పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఫీల్డింగ్‌లో క్యాచ్ డ్రాప్ చేసి ట్రోలింగ్‌కి టార్గెట్ అయినా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేయలేదు పృథ్వీషా.

మొదటి ఇన్నింగ్స్‌లో అవుట్ అయినట్టుగానే బౌల్డ్ అయ్యాడు. కాకపోతే మొదటి ఇన్నింగ్స్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ప్యాట్ కమ్మిన్స్... పృథ్వీషాని క్లీన్ బౌల్డ్ చేశాడు. 

రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన పృథ్వీషా.. టెస్టు ఛాంపియన్ షిప్‌లో డకౌట్ అయిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఐసీసీ వరల్డ్‌కప్‌లో డకౌట్ అయిన మొదటి భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ కాగా, టీ20 వరల్డ్‌కప్‌లో గంభీర్ ఈ చెత్త రికార్డు నమోదుచేశాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దినేశ్ మోంగియా డకౌట్ కాగా... టెస్టు ఛాంపియన్‌షిప్‌లో డకౌట్ అయి పృథ్వీషా... ఈ ముగ్గురి సరసన నిలిచాడు. పృథ్వీషా కంటే నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన బుమ్రా... స్టార్క్, కమ్మిన్స్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం విశేషం. రెండో రోజు ఆట ముగిసేసమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది టీమిండియా.