వెన్నెముక గాయంతో బాధపడుతున్న ప్రసిద్ధ్ కృష్ణ... సర్జరీ పూర్తి! కోలుకోవడానికి ఆరు నెలలకు పైగా సమయం... IPL 2023 సీజన్ మొత్తానికి దూరమైన ఫాస్ట్ బౌలర్..
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గత సెప్టెంబర్‌లో గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ, వారం రోజుల కిందట వెన్నెముకకి సర్జరీ చేయించుకున్నాడు...
న్యూజిలాండ్ ఏ టీమ్‌తో అనధికారిక టెస్టు సిరీస్ సమయంలో ప్రసిద్ధ్ కృష్ణ గాయపడడంతో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని ఆడించింది బీసీసీఐ. గత సీజన్‌లో అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, ఆఖరి ఆటలో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...
టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. భారత జట్టు తరుపున 14 వన్డేలు ఆడి 5.32 ఎకానమీతో 25 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...
ప్రసిద్ధ్ కృష్ణ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 నెలల వరకూ సమయం పడుతుందని వైద్యులు తెలియచేశారు. రాజస్థాన్ రాయల్స్ తరుపున గత సీజన్‌లో 17 మ్యాచులు ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ 19 వికెట్లు పడగొట్టాడు.
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 51 మ్యాచులు ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరి, అంచనాలకు మించి రాణించిన రాజస్థాన్ రాయల్స్, 2023 మినీ వేలంలోనూ మంచి ప్లేయర్లను కొనుగోలు చేసింది. జాసన్ హోల్డర్‌ని రూ.5.75 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆసీస్ యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను బేస్ ప్రైజ్ రూ.1 కోటి 50 లక్షలకే కొనుగోలు చేసింది..
ఇంగ్లాండ్ టెస్టు బ్యాటర్, మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్‌ని రూ.1 కోటి బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, డినోవన్ ఫెర్రారియాని రూ.50 లక్షలకు దక్కించుకుంది. కె.ఎం. అసిఫ్‌ని రూ.30 లక్షలకు, అబ్దుల్, ఆకాశ్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కునాల్ రాథోడ్‌లను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, ఈసారి కూడా టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌ని రిపీట్ చేయాలని ఆశిస్తోంది..
అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ప్రసిద్ధ్ కృష్ణ లేని లోటు, ఆర్‌ఆర్‌పై తీవ్రంగా ప్రభావం చూపించవచ్చు. అయితే నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్డ్, ఓబెడ్ మెక్‌కాయ్ వంటి ఫాస్ట్ బౌలర్లు, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఉన్నారు. వీరిలో భారత ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ ఎప్పుడు గాయపడతాడు? ఎప్పుడు ఆడతానేది చెప్పడం కాస్త కష్టమే..
