ధోనిని బీసీసీఐకి పరిచయం చేసిన ప్రకాశ్ చంద్ర కన్నుమూత..
MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం, మూడు ఐసీసీ ట్రోఫీలతో పాటు భారత్‌కు కీలక విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనిని భారత జట్టుకు ఆడించడంలో కీలక పాత్ర పోషించిన ప్రకాశ్ చంద్ర కన్నుమూశారు.
బెంగాల్ మాజీ క్రికెటర్ ప్రకాశ్ చంద్ర పొద్దర్ తుది శ్వాస విడిచారు. జాతీయ జట్టులో అంతగా గుర్తింపు లేకపోయినా బెంగాల్ తరఫున రంజీలలో మెరుగైన ప్రదర్శన చేశారు ప్రకాశ్ చంద్ర. ఆయన ఆట నుంచి తప్పుకున్నాక దేశంలో యువ క్రికెటర్లను వెతికి పట్టుకునే పనిలో నిమగ్నమై భారత క్రికెట్ కు ఎనలేని సేవ చేసిన జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనిని బీసీసీఐకి పరిచయం చేశారు. 82 ఏండ్ల వయసున్న ప్రకాశ్ చంద్ర.. డిసెంబర్ 29నే చనిపోయినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
1940లో బెంగాల్ లో జన్మించిన ప్రకాశ్ చంద్ర.. 1960 నుంచి 1977 దాకా తన రాష్ట్రం తరఫున 74 రంజీ మ్యాచ్ లు ఆడారు. తన కెరీర్ లో 3,836 పరుగులు చేశారు. ఇందులో 11 సెంచరీలు కూడా ఉన్నాయి. ఆట నుంచి రిటైర్ అయ్యాక బీసీసీఐ ఆయనను 2003లో టాలెంట్ రీసోర్స్ డెవలప్మెంట్ స్కీమ్ (టీఆర్‌డీఎస్) లో సభ్యుడిగా చేర్చింది.
తన విధుల్లో భాగంగా ఆయన దేశవాళీ మ్యాచ్ లను పరిశీలిస్తూ.. ధోనిని చూశారు. అప్పుడే అతడిలో విషయం ఉందని గ్రహించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కు అతడి పేరును రికమెండ్ చేశారు. ప్రకాశ్ చంద్ర ఇచ్చిన సిఫార్సులతో ధోని.. 2003-04లో ఇండియా‘ఏ’ టీమ్ కు ఎంపిక చేసింది. ఆ మరుసటి ఏడాదే ధోని.. భారత సీనియర్ జట్టుకు ఆడాడు.
ధోని గురించి ఓ సందర్భంలో ప్రకాశ్ చంద్ర మాట్లాడుతూ.. ‘అతడు (ధోని) తన శక్తిని ఉపయోగించిన విధానాన్ని మనం సరిగా వాడుకోగలిగితే అతడు భారత క్రికెట్ కు పనికొస్తాడని నేను భావించా. అందుకే అతడిని నేను ఎన్సీఏకు రికమెండ్ చేశాను. ధోనికి హ్యాండ్ పవర్ ఉంది. అతడిని మనం గైడ్ చేయగలిగితే మంచి వన్డే క్రికెటర్ అవుతడాని నేను అనుకున్నా..’అని చెప్పారు. ప్రకాశ్ చంద్ర భావించినట్టే ధోని.. భారత క్రికెట్ గతిని మార్చాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.