ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సాధించిన విజయాన్ని తన భార్యకు అంకితమిచ్చాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు పొలార్డ్

ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సాధించిన విజయాన్ని తన భార్యకు అంకితమిచ్చాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు పొలార్డ్. గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ వైదలగొడంతో పొలార్డ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసిన అతను ముంబైకి విజయాన్నందించాడు.

మ్యాచ్ అనంతరం అతని కుమారుడు కైడన్ పొలార్డ్ తండ్రిని సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అతన మాట్లాడుతూ తనకు బలంగా బాదగలిగే శక్తినిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ విజయాన్ని భగవంతునితో పాటు నా భార్యకు అంకితమిస్తున్నాను అన్నాడు. బుధవారం పొలార్డ్ భార్య జెనా అలీ పుట్టిన రోజు. వాంఖెడేలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతానన్న పొలార్డ్ ఎక్కువ బంతులు ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతోనే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నాడు.

చివరల్లో కాస్త ఉత్కంఠ రేగినా ఫలితం తమకు అనుకూలంగా వచ్చిందని పొలార్డ్ తెలిపాడు. తదుపరి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో ఉంటాడని వెల్లడించాడు.