ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన టీమిండియాపై అన్ని వైపుల నుంచి ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ సహా క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు భారత జట్టును అభినందిస్తున్నారు.

బ్రిస్బేన్ కోట‌ను టీమిండియా బ‌ద్ధ‌లు కొట్ట‌గానే ట్విట‌ర్‌లో త‌న ఆనందాన్ని పంచుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. గ్రేటెస్ట్ సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌ట‌ిగా సచిన్ అభివర్ణించాడు.

 

 

ఈ సిరీస్‌లో ప్ర‌తి సెష‌న్‌కు ఓ హీరో దొరికాడ‌ని మాస్ట‌ర్ పేర్కొన్నాడు. దెబ్బ త‌గిలిన ప్ర‌తిసారీ బ‌లంగా నిల‌బ‌డ్డామని.. భ‌యం లేని క్రికెట్ ఆడామనని టెండూల్కర్ చెప్పాడు. గాయాలు, అనిశ్చితులు ఆత్మ‌విశ్వాసాన్నే పెంపొందించాయని అభినందించాడు. 

భారత్‌ చారిత్రక విజయం పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ట్విటర్‌ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత విజయం సాధించడం అత్యంత సంతోషాన్ని కలిగించిందన్నారు.

ఆటగాళ్ల ఎనర్జీ, ఆట పట్ల వారికున్న తపన, పట్టుదల, గెలవాలనే సంకల్పం టోర్నీ ఆద్యంతం ప్రతిబింబించిందన్నారు. త్వరలో జరగనున్న టోర్నీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని మోడీ ఆకాంక్షించారు.

 

 

అటు భారత జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలియజేశారు. కీలక ఆటగాళ్లు గాయాల బారినపడినా వున్న కాస్త వనరులతోనే టీమిండియా అద్భుతం చేసిందని ప్రశంసించారు. ఈ విజయం ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు.

అటు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కూడా భారత జట్టును ప్రశంసించారు. భారత జట్టు తమను గర్వపడేలా చేసిందని... ఇది చరిత్రలో నిలిచిపోయే విజయంగా కేటీఆర్ అభివర్ణించారు. కొత్త ఏడాదిని అద్భుతంగా ప్రారంభించారని తారక రామారావు వ్యాఖ్యానించారు. 

 

 

వీరితో పాటు విరాట్‌ కోహ్లి, వీవీఎస్‌ లక్క్ష్మణ్‌, శిఖర్‌ ధావన్‌, ఇశాంత్‌ శర్మ తదితరులు ట్విటర్‌ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్‌ దిగ్గజం సుందర్‌ పిచాయ్‌ కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు.