భారత్, బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న తొలి పింక్ బాల్ డే నైట్ టెస్ట్ మ్యాచులో చారిత్రక టాస్ ను బంగ్లా గెలిచింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, బంగ్లాదేశ్ ఇరు టీంలకు కూడా ఇదే తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచుల సిరీస్ లో ఈ మ్యాచ్ రెండోది. 

మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈడెన్ గార్డెన్స్ లో గంటను మోగించనున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేన్‌ హసీనా, గంటను మోగించి మ్యాచును ఆరంభించడమే కాకుండా, ఈ కోల్‌కత టెస్టు తొలి రోజు ఆటను వీక్షించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ గురువారం నాడే ఒక ప్రకటన విడుదల చేసింది.  

భారత ప్రధాని నరెంద్ర మోడీ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్‌ ప్రధాని కోల్‌కత టెస్టుకు వచ్చారు. బారత క్రీడా రంగంలోనే అరుదైన ఘట్టం డే నైట్‌ గులాబీ టెస్టును బంగ్లా ప్రధాని ప్రారంభించారు. తొలి సెషన్‌కు ముందు ఈడెన్‌ గార్డెన్స్‌లో గంటను మోగించి షేక్‌ హసినా ఆటను ప్రారంభిస్తారు.

ఇక ఈడెన్ గార్డెన్స్ లోని గంట విషయానికి వస్తే, భారత దేశంలో సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం తరువాత గంటను ఏర్పాటు చేసిన రెండో స్టేడియం గా ఈడెన్ గార్డెన్స్ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఎప్పటినుండో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దాన్ని మిగిలిన దేశాలు కూడా పునికి పుచ్చుకున్నాయి. 

2016లో భారత్, న్యూజీలాండ్ ల మధ్య జరిగిన రెండవ టెస్టులో ఇక్కడ ఈ గంటను ఏర్పాటు చేసారు. అప్పట్లో భారత మాజీ దిగ్గజ అల్ రౌండర్ కపిల్ దేవ్ ప్రారంభించాడు. 

 హసీనాతో పాటు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత క్రికెట్‌ దిగ్గజాలు సునీల్‌ గావస్కర్, కపిల్‌ దేవ్, సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే తదితరులు తొలి రోజు ఆటను ప్రత్యక్షంగా తిలకిస్తారు. టీ బ్రేక్ టైం లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనాల్లో భారత మాజీ కెప్టెన్లు స్టేడియంలో కలియతిరగనున్నారు. ఈ సమయంలోనే సంగీత కార్యక్రమం కూడా ఉండనుంది. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు లోకల్ స్టార్, జీత్‌ గంగూలీ, బెంగాలీ గాయని రూనా లైలా తదితరులు ఈ కార్యక్రమం  లో పెర్ఫామ్ చేయనున్నారు. 

మ్యాచ్ డిన్నర్ బ్రేక్‌ సమయంలో భారత దిగ్గజ ‘ఫ్యాబ్‌ 5’ క్రికెటర్స్... సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లతో ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో చారిత్రాత్మక 2001 లో ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య ఇదే ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్టు విశేషాల గురించి మాట్లాడతారు. 

మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత దేశానికి కీర్తిని ఇనుమడింపు చేసిన వివిధ రంగాల క్రీడాకారులను ఘనంగా సన్మానించనున్నారు. వారు సైతం ఈ మ్యాచును వీక్షిస్తారు. ఈ జాబితాలో షూటర్‌ అభినవ్‌ బింద్రా, షట్లర్‌ పీవీ సింధు, చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, మేటి బాక్సర్‌ మేరీ కోమ్, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్ పుల్లెల గోపీచంద్‌ మొదలైనవారు ఉన్నారు.