Asianet News TeluguAsianet News Telugu

పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్... మళ్లీ సిరీస్ సమం! బాబర్ ఆజమ్ రికార్డు...

పాక్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో ఊదేసిన ఇంగ్లాండ్... ఫిలిప్ సాల్ట్ సెన్సేషనల్ ఇన్నింగ్స్... టీ20ల్లో 3 వేల పరుగుల మైలురాయి అందుకున్న బాబర్ ఆజమ్...

Philip salt sensational knock, England beats Pakistan and equalizes T20 Series
Author
First Published Oct 1, 2022, 11:36 AM IST

పాకిస్తాన్ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు టీ20 సిరీస్‌ హోరాహోరీగా సాగుతోంది. వరుసగా నాలుగు, ఐదో టీ20లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్, ఆరో టీ20 మ్యాచ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. దీంతో సిరీస్ ఫలితం తేల్చేందుకు ఆఖరి, ఏడో టీ20 మ్యాచ్ దాకా వేచి చూడబోతున్నాయి ఇరు జట్లు. ఆరో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది...


బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసిన కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ హారీస్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. మహ్మద్ హారీస్ 7 పరుగులు చేసి అవుట్ కాగా షాన్ మసూద్ డకౌట్ అయ్యాడు. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన హైదర్ ఆలీ, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ని ఇఫ్తికర్ అహ్మద్, బాబర్ ఆజమ్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన ఇఫ్లికర్ అహ్మద్ కూడా సామ్ కుర్రాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 

అసిఫ్ ఆలీ 9 పరుగులు చేయగా మహ్మద్ నవాజ్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో పాతుకుపోయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

టీ20ల్లో 3 వేల పరుగులను అందుకున్న బాబర్ ఆజమ్, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ 81 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల టీ20 పరుగులు సాధించగా బాబర్ ఆజమ్‌కి ఇది 81వ ఇన్నింగ్స్...

అయితే 3 వేల పరుగులు అందుకోవడానికి అత్యధిక బంతులు తీసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు బాబర్ ఆజమ్. రోహిత్ శర్మ 2149 బంతుల్లో, విరాట్ కోహ్లీ 2169 బంతుల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకోగా మార్టిన్ గుప్టిల్ 2203, పాల్ స్టిర్లింగ్ 2226 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాబర్ ఆజమ్ ఏకంగా 2317 బంతులను వాడుకున ఆఖరి ప్లేస్‌లో ఉన్నాడు...

170 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కి అదిరిపోయే ఆరంభం అందించాడు ఫిలిప్ సాల్ట్. మొదటి ఓవర్ నుంచి హిట్టింగ్‌కి దిగిన ఫిలిప్ సాల్ట్ కారణంగా 3.4 ఓవర్లలో 50 పరుగులను దాటేసింది ఇంగ్లాండ్ స్కోరు. 12 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్‌ని షాదబ్ ఖాన్ అవుట్ చేశాడు...

18 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ కూడా షాదబ్ ఖాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 41 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 88 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్, 16 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన బెన్ డక్కెట్ నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ని ముగించారు. 

ఫిలిప్ సాల్ట్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా 14.3 ఓవర్లలో మ్యాచ్‌ని ముగించింది ఇంగ్లాండ్. పాకిస్తాన్‌పై టీ20ల్లో ఇంగ్లాండ్‌కి ఇది 17వ విజయం. ఇంకో విజయం అందుకుంటే టీ20ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తుంది...

Follow Us:
Download App:
  • android
  • ios