Muttiah Muralitharan on Sri Lanka Crisis: శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఇటీవలే మహేళ జయవర్ధనే, కుమార సంగక్కరలు దీనిపై మాట్లాడగా.. తాజాగా దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చాడు.
శ్రీలంకలో నానాటికీ ముదురుతున్న ఆర్థిక సంక్షోభానికి చరమగీతం పాడేందుకు ప్రజలంతా కలిసి రావాలని ఆ దేశ మాజీ స్పిన్నర్, ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెంటార్ గా పనిచేస్తున్న ముత్తయ్య మురళీధరన్ పిలుపునిచ్చాడు. ప్రజలు, పార్టీలు.. తమ జాతి, మతం, పార్టీలను పక్కనబెట్టి దేశం కోసం ఒక్కటిగా ముందుకు కదలాలని అన్నాడు. లంకలో ఏర్పడిన ఆర్థిక అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అతడు ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆర్థిక సంక్షోభం ఇప్పటికిప్పుడు కొత్తగా ఊడిపడ్డది కాదని తెలిపాడు.
మురళీధరన్ మాట్లాడుతూ... ‘కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు, ప్రజలు తమ మతం, జాతి, పార్టీలను పక్కనబెట్టి ఒక్కటిగా కలిసిరావాలి. ఒక్కటిగా పోరాడితేనే ఈ మహమ్మారి (మాంద్యాన్ని) అరికట్టుతాం.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. చమురు ధరలు ఆకాశాన్నంటాయి. అయితే ఇందులో ప్రభుత్వ నిర్వహణ లోపం లేదనలేం. కానీ అదొక్కటే దీనికి కారణమని కూడా చెప్పలేం...’ అని మురళీధరన్ చెప్పుకొచ్చాడు.
భారత్, చైనాలు సాయం చేయాలి...
ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న లంకకు పొరుగుదేశాలైన భారత్, చైనాల సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తో పాటు ఇతర సంస్థలు కూడా ముందుకు రావాలి..
ఒక్కరోజులో రాలేదు...
డాలర్ సంక్షోభం శ్రీలంక లో ఏర్పడింది. మేము చాలా వరకు మాకు అవసరమయ్యే సరుకులను దిగుమతి చేసుకుంటుంటాం. ఇప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో మేం వంద డాలర్లకు కొనుగోలు చేసిన వస్తువులు ఇప్పుడు ఏడువందల డాలర్లకు చేరాయి. ప్రజలు నిత్యావసరాలు కొనలేని స్థితికి వచ్చారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితి ఒక్క రోజులో వచ్చింది కాదు.. ఒక్కరోజులో పోయేదీ కాదు. అందరం కలిసి కట్టుగా పోరాడితేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలం...
కాగా ఇదే విషయమై రెండ్రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్ధనేలు కూడా స్పందించారు. జయవర్ధనే స్పందిస్తూ.. ‘దేశంలో తీవ్రమైన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యలు మానవ సహితమే. సమర్థవంతమైన వ్యక్తులు వాటిని పరిష్కరించగలరు. కొంతమంది వ్యక్తులు లంక ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ఈ పరిస్థితులకు కారణమయ్యారు. వాళ్లు ప్రజా విశ్వాసం కోల్పోయారు...’ అని రాసుకొచ్చారు. ఇక సంగక్కర స్పందిస్తూ.. ప్రజల దుస్థితి చూస్తుంటే హృదయ విదారకంగా ఉందని తెలిపాడు.
