జై షా కామెంట్స్‌కు పీసీబీ స్పందన.. ఏకపక్ష ప్రకటనలు తగదంటూ సూచన
Pakistan Cricket Board: వచ్చే ఏడాది పాకిస్తాన్ లో నిర్వహించే ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం పర్యటించబోదని చెప్పిన బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలపై పీసీబీ స్పందించింది.
2023 ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తే టీమిండియా ఆడే అవకాశమే లేదని.. తటస్థ వేదిక అయితే ఆలోచిస్తామని చెప్పిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ లో భగ్గుమన్నాయి. ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా ఏకపక్షంగా ఈ ప్రకటన చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. జై షా.. 2023 పాకిస్తాన్ లో నిర్వహించదలిచిన ఆసియా కప్ ను యూఏఈకి మార్చాలని చూస్తున్నాడని ఆరోపించింది.
జై షా వ్యాఖ్యలపై పీసీబీ అధికారిక ప్రకటన వెలువరిస్తూ.. ‘ఏసీసీ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు నిరాశతో పాటు ఆశ్చర్యానికి గురి చేశాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్ లో నిర్వహించదలిచిన ఆసియా కప్ ను జై షా.. ఇక్కడ్నుంచి తటస్థ వేదికకు తరలించాలని చూస్తున్నాడు. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పీసీబీని గానీ ప్రధాన నిర్వాహకులైన ఏసీసీని గానీ సంప్రదించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది ఏసీసీ దీర్ఘకాలిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది.
ఏసీసీ మీటింగ్ తర్వాత ఏసీసీ బోర్డ్ మెంబర్స్ సూచనల మేరకు ఈసారి టోర్నీ నిర్వాహక హక్కులు పాకిస్తాన్ కు దక్కాయి. కానీ జై షా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన చేసిన కామెంట్స్ ఏకపక్షంగా ఉన్నాయి. ఇది ఆసియా క్రికెట్ కౌన్సిల్ - 1983 క్రీడా స్పూర్తికి విరుద్ధం. ఆసియాలో క్రికెట్ ను అభివృద్ధి చేయాలనే ఏసీసీ స్ఫూర్తిని జై షా వ్యాఖ్యలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయి.
ఇటువంటి ప్రకటనల ప్రభావం ఆసియా, అంతర్జాతీయ క్రికెట్ కమ్యూనిటీలను విభజించే అవకాశముంది. అంతేగాక అవి 2023లో భారత్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్, 2024-2031లో ఐసీసీ భవిష్యత్ సైకిల్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ విషయంపై మాకు (పీసీబీ) ఇప్పటివరకు ఏసీసీ నుంచి గానీ ఏసీసీ అధ్యక్షుడి నుంచి గానీ అధికారిక సమాచారం రాలేదు. ఈ విషయంలో ఏసీసీ తక్షణమే సమావేశం నిర్వహించి చర్చించాలని కోరుతున్నాం..’ అని ప్రకటన విడుదల చేసింది.