మేం కదా అనౌన్స్ చేయాల్సింది! మీరు ఎలా ప్రకటిస్తారు... ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలపై పీసీబీ అసంతృప్తి..
ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు... ఆ కార్యక్రమానికి అరగంట ముందే షెడ్యూల్ రిలీజ్ చేసిన జై షా..

షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సింది. అయితే కొన్ని ఏళ్లుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చెడిపోవడంతో పాకిస్తాన్‌లో అడుగుపెట్టడానికి భారత జట్టు అంగీకరించకపోవడంతో ఎన్నో చర్చోపచర్చల తర్వాత హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించబోతున్నారు..
పాకిస్తాన్‌లో 4 మ్యాచులు జరగబోతుంటే, మిగిలిన 9 మ్యాచులు శ్రీలంకలో జరగబోతున్నాయి. జూలై 19న బీసీసీఐ సెక్రటరీ, ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా, ఆసియా కప్ 2023 టోర్నీ షెడ్యూల్‌ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు..
వాస్తవానికి ఆసియా కప్ 2023 టోర్నీ ఆతిథ్య హక్కులు పొందిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, షెడ్యూల్ విడుదల చేసేందుకు ఓ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంది. లాహోర్‌లో జూలై 19న జరిగిన ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జాకా ఆష్రఫ్‌తో పాటు పాక్ మాజీ క్రికెటర్లు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు...
ఈ కార్యక్రమంలో పీసీబీ చీఫ్ జాకా ఆష్రఫ్, ఆసియా కప్ 2023 టోర్నీని ఆవిష్కరించాడు. అయితే ఆ కార్యక్రమం కంటే ముందే ఏసీసీ ప్రెసిడెంట్ జై షా, ఆసియా కప్ 2023 టోర్నీ షెడ్యూల్‌ని విడుదల చేయడం హాట్ టాపిక్ అయ్యింది..
‘రూల్స్ ప్రకారం ఏషియా క్రికెట్ కౌన్సిల్, ఆసియా కప్ 2023 టోర్నీ షెడ్యూల్‌ని సోషల్ మీడియాలో విడుదల చేయాలి. అయితే పీసీబీ కార్యక్రమం ముగిసిన తర్వాత 5 నిమిషాలకు సోషల్ మీడియాలోకి రావాల్సిన షెడ్యూల్... ప్రోగ్రామ్ మొదలుకావడానికి అరగంట ముందే వచ్చేసింది...
ఇది పీసీబీకి షాక్‌కి గురి చేసింది. ఆతిథ్య హక్కులు దక్కించుకున్నప్పటికీ పాకిస్తాన్‌లో ఆసియా కప్ పెట్టనివ్వలేదు, కనీసం షెడ్యూల్ విడుదల చేసేందుకు కూడా అవకాశం ఇవ్వరా?..’ అంటూ పీసీబీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పీటీఐ రాసుకొచ్చింది..
అయితే జై షా ఇలా అరగంట ముందే షెడ్యూల్‌ని విడుదల చేయడానికి కారణం భారత కాలమానం, పాక్ కాలమానానికి ఉన్న వ్యత్యాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమేనని వివరణ ఇచ్చింది ఏషియా క్రికెట్ కౌన్సిల్...
భారత కాలమానం కంటే పాకిస్తాన్ అరగంట వెనకాల ఉంటుంది. అంటే ఇక్కడ 7 గంటలు అయితే, పాకిస్తాన్‌లో 6:30. అయితే ఈ విషయం తెలియని జై షా, కార్యక్రమం మొదలైపోయి ఉంటుందని భావించి.. షెడ్యూల్ విడుదల చేశారని వివరణ ఇచ్చింది ఏసీసీ..
ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్తాన్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 టోర్నీ మొదలవుతుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2న శ్రీలంకలో కెండీలో గ్రూప్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా, పాకిస్తాన్ జట్లు గ్రూప్ స్టేజీలో నేపాల్‌పై గెలిస్తే... సెప్టెంబర్ 10న ఇరుజట్ల మధ్య కొలంబోలో సూపర్ 4 మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లు సూపర్ 4లో టాప్ 2లో నిలిస్తే సెప్టెంబర్ 17న కొలంబోలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.