Asianet News TeluguAsianet News Telugu

త్వరలో భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సీరిస్... సంకేతాలివే: పిసిబి

దాదాపు దశాబ్ద కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా  దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఇరు దేశాల మధ్య స్పేహబంధాన్ని పెంచుతోందని పిసిబి అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో త్వరలో భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సీరీస్ లు జరిగే అవకాశముందని సదరు అధికారి ఆశాభావం వ్యక్తం చేశాడు.  

pcb managing director wasim khan comments about india-pakistan cricket relationship
Author
Islamabad, First Published Jul 30, 2019, 2:40 PM IST

దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో ఇరుదేశాల క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం  తెలిసింది. ఈ మధ్య జరిగిన పుల్వామా దాడితో పాకిస్థాన్ హస్తముందని... కాబట్టి ఐసిసి టోర్నీల్లో కూడా ఆ జట్టుతో ఆడకూడదని భారత ప్రజలు బిసిసిఐని డిమాండ్ చేస్తున్నారు. ఇలా దాదాపు దశాబ్దకాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరీస్ లు జరక్కపోగా ఇప్పుడు ఐసిసి టోర్నీలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ఈ సమయంలోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యే పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయని పిసిబి మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా వసీంఖాన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అతడు దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తొలగిపోయి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోందని అన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే అతి  త్వరలో భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సీరిస్ లు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని వసీం ఖాన్ పేర్కొన్నాడు.

'' ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపర్చేందుకు పిసిబి చాలా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు బిసిసిఐ కూడా తమకు సహకరిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఐసిసి ఫైనాన్షియల్ ఆండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ హెడ్ గా పిసిబి ఛైర్మన్ ఇషాన్ మనీ నియమితులయ్యారు. అందుకు ప్రస్తుత ఐసిసి అధ్యక్షులు, మాజీ  బిసిసిఐ అధ్యక్షులు శశాంక్ మనోహర్ సహకరించారు. 

ఇక ఆసియా  క్రికెట్ కౌన్సిల్ సమావేశంలోనూ బిసిసిఐ అధికారులు పాక్ కు అండగా  నిలిచారు. ఇలా వచ్చే ఏడాది ఆసియా కప్ టీ20  టోర్నమెంట్ పాకిస్థాన్ లో నిర్వహించడానికి బిసిసిఐ ఎలాంటి  అభ్యంతరం తెలపలేదు. ఈ పరిణామాలన్నింటిని చూస్తే ఇరు  దేశాల క్రికెట్ సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.'' అని వసీం ఖాన్ వెల్లడించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios