Asianet News TeluguAsianet News Telugu

PBKS vs SRH: చివరి ఓవర్లో నరాల తెగే ఉత్కంఠ..  సన్ రైజర్ థ్రిలింగ్ విక్టరీ..

IPL 2024 - PBKS vs SRH: ఐపీఎల్‌-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా  పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొని, చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌ విజయం సాధించగా, పంజాబ్‌ ఓటమి పాలైంది. 

PBKS vs SRH, IPL 2024: SunRisers survive Shashank-Ashutosh scare in Mullanpur thriller KRJ
Author
First Published Apr 10, 2024, 12:11 AM IST

IPL 2024 - PBKS vs SRH: ఐపీఎల్‌-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ తరువాత 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్ లో చివరి బంతి వరకు పోరాడి కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాల్పడింది.

శశాంక్ సింగ్ 25 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో అజేయంగా 46 పరుగులు చేయగా.. అశుతోష్ శర్మ 15 బంతుల్లో మూడు ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 33 పరుగులు చేశారు. అయినప్పటికీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. చివరి ఓవర్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ రేపింది. పంజాబ్ విజయానికి చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది.

శశాంక్, అశుతోష్‌లు విధ్వంస ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ పంజాబ్ ఆరు వికెట్లు కోల్పోయి.. 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ తరుపున ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు హైదరాబాద్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ 64 పరుగుల సాయంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీయగా, శామ్‌ కుర్రాన్‌, హర్షల్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 
 
ఆరంభంలోనే షాక్ 
    
లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను అవుట్ చేయడంతో  పంజాబ్‌కు తొలి దెబ్బ తగిలింది.  నాలుగు పరుగుల స్కోరు వద్ద ఇంపాక్ట్ ప్లేయర్  ప్రభసిమ్రాన్ సింగ్ ను ఔట్ చేసి పంజాబ్ కు భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. ఆ తర్వాత ధావన్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా భువనేశ్వర్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఐపీఎల్‌లో ధావన్ స్టంప్ అవుట్ కావడం ఇది ఎనిమిదోసారి. ఈ టోర్నీలో ఇదే అత్యధికం. ఈ విషయంలో సురేష్ రైనా, రాబిన్ ఉతప్పలను ధావన్ సమం చేశాడు. పవర్‌ప్లేలో తడపడ్డ పంజాబ్  .. హైదరాబాద్ బౌలర్లు పంజాబ్‌పై ఎంత ఒత్తిడి తెచ్చారు. పవర్‌ప్లే సమయంలో పంజాబ్ జట్టు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి  పంజాబ్ మూడు వికెట్లకు 27 పరుగులు చేసింది.  

శశాంక్‌-అశుతోష్‌ల హిట్టింగ్  

పీకల లోతు కష్టాల్లో పడ్డ జట్టును మరోసారి శశాంక్, అశుతోష్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌కు విజయాన్ని అందించాలని ప్రయత్నించారు. ఈ సమయంలో అశుతోష్‌కు మూడుసార్లు లైఫ్ వచ్చింది. చివరి ఓవర్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో అశుతోష్ భారీ షాట్లు ఆడాడు. మూడుసార్లు బౌండరీ లైన్ వద్ద నిలబడి ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. శశాంక్ వరుసగా రెండో మ్యాచ్‌లో జట్టును గెలిపించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ ఈసారి అతడు విఫలమయ్యాడు. అయితే వారి ప్రయత్నాలకు పూర్తి మార్కులు పడతాయి.

చివరి ఓవర్ లో నరాలు తెగే ఉత్కంఠ

పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే ఆరు బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఉన్నారు. చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి జయదేవ్ ఉనద్కత్ వచ్చాడు. తొలి బంతికే అశుతోష్‌ భారీ షాట్ కు ప్రయత్నించారు. బౌండరీ లైన్ పై ఉన్న నితీష్ రెడ్డి క్యాచ్ మిస్ చేయడంతో సిక్సర్ గా మారింది. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ లో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో తర్వాతి రెండు బంతులను వైడ్‌గా బౌల్డ్ చేశాడు ఉనద్కత్. ఇప్పుడు పంజాబ్‌కు ఐదు బంతుల్లో 21 పరుగులు కావాలి. ఆ తరువాత రెండో బంతికి అశుతోష్‌ భారీషాట్ ఆడారు. అది కూడా బౌండరీ లైన్ పై ఉన్న ఫిల్డర్ క్యాచ్ మిస్ చేయడంతో అద్భుతమైన సిక్సర్‌ గా మారింది. ఈ తరుణంలో పంజాబ్ నాలుగు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది.

ఎంతో అనుభవ ఉన్న ఉనద్కత్ కూడా బౌలింగ్ చేయడానికి టెన్షన్ పడ్డారని చెప్పాలని, ఈ తరుణంలో సన్ రైజర్స్ కెప్టెన్ కమ్మిన్స్.. ఉనద్కత్ దగ్గరకి వచ్చి కూల్ మోటివెంట్ చేశారు. అనంతరం ఉనద్కత్ యార్కర్ వేయడంతో మూడో బంతికి అశుతోష్ కష్టంగా రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తరువాత నాలుగో బంతికి కూడా అశుతోష్ మళ్లీ రెండు పరుగులు రాబట్టాడు.

ఇప్పుడు పంజాబ్ విజయం సాధించాలంటే..  రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. ఉనద్కత్ మళ్లీ వైడ్ బాల్‌ను వేశాడు. ఆ తరువాత బంతిని భారీ షాట్ గా మలువాలని ప్రయత్నించిన అది సెట్ కాలేదు. కేవలం ఓ పరుగు మాత్రమే వచ్చింది. దీంతో సన్ రైజర్స్ విజయం దాదాపు ఖాయమైంది. కానీ.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ ..ఈ తరుణంలో ఉనద్కత్ ఎలాంటి పొరపాటు చేయకుండా బౌలింగ్ వేశాడు. కానీ, ఆఖరి బంతికి శశాంక్ సిక్సర్ బాదాడు. ఫైనల్ గా ఉత్కంఠభరితంగా  సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ పై సన్ రైజర్స్ విజయం సాధించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios