TATA IPL 2022 PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ మిచెల్ సాంట్నర్ ను ఔట్ చేయగానే వినూత్న రీతిలో వేడుక జరుపుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ అంటేనే భావోద్వేగాల వేదిక. క్యాచ్ పట్టినా, వికెట్ తీసినా, సిక్సర్ కొట్టినా, సెంచరీ చేసినా.. ఏం చేసినా అక్కడ అదో ఉత్సవమే. ఆటగాళ్ల ఎమోషన్స్ పీక్స్ కు చేరితే అంతే. ఒక్కొక్కరు ఒక్కో తరహా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ముఖ్యంగా బౌలర్లు.. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా పుణ్యమా అని అందులో కొత్త ట్రెండులలో చాలావరకు క్రికెటర్లు ఫాలో అవుతుంటారు. పుష్ప లో తగ్గేదేలే, రొనాల్డో ను కాపీ కొట్టిన మహ్మద్ సిరాజ్, నైమెర్ స్టైల్ లో చేసే వనిందు హసరంగ సెలబ్రేషన్స్ ఈ కోవలోకి చెందినవే.. అయితే ఇదివరకు ఒకరు చేసింది అనుకరించని వాళ్లు తమకు నచ్చిన రీతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోమవారం అదే పని చేశాడు పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.
సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ పోరులో భారీ లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్కే బ్యాటర్ మిచెల్ సాంట్నర్ ను ఔట్ చేశాడు అర్ష్‌దీప్. అతడిని ఔట్ చేయగానే.. రథం నడుపుతున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
సీఎస్కే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో అర్ష్‌దీప్ సింగ్ ఇలా వెరైటీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఆ ఓవర్లో మూడో బంతిని ఫ్లిక్ షాట్ ఆడదామనుకున్న సాంట్నర్ అంచనా తప్పింది. బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో అర్ష్‌దీప్ సింగ్.. చేతులు ముందుకు చాచి, రథానికి ముందు కట్టేసిన గుర్రాల తాళ్లను అటూ ఇటూ అన్నట్టుగా చేస్తూ కొత్త తరహా వేడుకలకు శ్రీకారం చుట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ను చూసిన నెటిజన్లు.. ‘ఏంటి రథం నడుపుతున్నావా..?’ అని కామెంట్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా ఈ ఐపీఎల్ లో అర్ష్‌దీప్ సింగ్ తో పాటు వనిందు హసరంగ, డ్వేన్ బ్రావో, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకుంటూ అభిమానులకు కావాల్సినంత ఫన్ ను పంచుతున్నారు.
ఇక పంజాబ్-చెన్నై మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (88 నాటౌట్), రాజపక్స (42) దంచికొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చెన్నై.. 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంబటి రాయుడు (78) వీరోచిత పోరాటం చేసినా అది సరిపోలేదు.
