Asianet News TeluguAsianet News Telugu

IPL: వెయ్యి సిక్సర్ల సీజన్.. అరుదైన ఘనత సాధించిన ఐపీఎల్-2022.. తొలి సిక్సర్ కొట్టింది అతడే..

IPL 2022: టీ20 అంటేనే బ్యాటర్లకు జాతర. బంతి ఏమాత్రం బ్యాట్ కు అనుకూలంగా వచ్చినా అది స్టాండ్స్ లో పడాల్సిందే. ఇక ఐపీఎల్ వంటి లీగ్  లో సిక్సర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? 

PBKS Batter Liam Livingstone Entered IPL record Books after He Smashed 1000th Six in IPL 2022 Season
Author
India, First Published May 23, 2022, 11:36 AM IST

మహారాష్ట్ర వేదికగా  రెండు నెలల పాటు  సాగిన ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన  మ్యాచ్ లో లీగ్ లు ముగిసి ఇక ప్లేఆఫ్స్ కు ముహుర్తం  కుదిరింది. కాగా ఈ సీజన్ లో ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని ఓ అరుదైన ఘనత  చోటు చేసుకుంది. ఐపీఎల్-15 లో తొలిసారి  వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి. హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్ లో పీబీకేఎస్ బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ సిక్సర్ బాదడంతో  ఈ సీజన్ లో వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి. 

సింగిల్ ఐపీఎల్ సీజన్ లో వెయ్యి సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి. గతంలో 2018 లో అత్యధికంగా 872  సిక్సర్లు నమోదయ్యాయి. ఆ రికార్డును ఐపీఎల్-15 బ్రేక్ చేసింది. ఐపీఎల్-15 లో ఇప్పటికి లీగ్ దశ ముగియగా ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ కూడా (నాలుగు మ్యాచులు) ఉండటంతో మరో వంద సిక్సర్లు కూడా నమోదయ్యే అవకాశముంది. 

తొలి సిక్స్ ఊతప్పది.. వెయ్యో సిక్స్ లియామ్ ది.. 

ఈ సీజన్ లో తొలి సిక్సర్ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప. ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్,   గతేడాది రన్నరప్  కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్  సందర్భంగా రాబిన్ ఊతప్ప తొలి సిక్సర్ బాదాడు.  ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ఊతప్ప సిక్సర్ కొట్టాడు. ఇక తాజాగా హైదరాబాద్ తో మ్యాచ్ లో షెపర్డ్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతికి సిక్సర్ కొట్టడం ద్వారా వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి. వెయ్యో సిక్సర్ కొట్టింది లివింగ్ స్టోన్.. 

 

అత్యధిక సిక్సర్ల  సీజన్లు.. 

2022 - 1001 
2018 - 878 
2019 - 784 
2020 - 734
2012 - 731 

ఇక పంజాబ్-హైదరాబాద్  మధ్య ముగిసిన మ్యాచ్ లో 22 బంతుల్లో 49 పరుగులు సాధించిన లివింగ్ స్టోన్ తన ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘కొంతమంది గత కొంతకాలంగా నా బ్యాటింగ్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. వారిని తప్పు అని ప్రూవ్ చేయడానికి నాకు ఈ సీజన్ ఎంతగానో ఉపయోగపడింది..’ అని విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. ఈ సీజన్ లో లివింగ్ స్టోన్ 14 మ్యాచులలో 437 పరుగులు సాధించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios