Pallonji Mistry Died: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ సోమవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.  అయితే ఈ భారతీయ వ్యాపార దిగ్గజానికి దేశ క్రీడారంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. 

భారతీయ వ్యాపార రంగంలో దిగ్గజంగా వెలుగొందిన ప్రముఖ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ సోమవారం తుదిశ్వాస విడిచారు. ముంబైలో ఉంటున్న ఆయన.. రాత్రి తన నివాసంలో కన్నుమూసినట్టు గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. అయితే భారత్ లోని గొప్ప కళాత్మకమైన భవనాలను నిర్మించిన షాపూర్జీ గ్రూప్ కు దేశ క్రీడారంగంతో విడదీయరాని సంబంధముందన్న విషయం ఎంతమందికి తెలుసు. కానీ ఇది నిజం. 

దేశ ఆర్థిక కార్యకలాపాలకు సూచిక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ముంబై) భవనం, తాజ్ మహల్ హోటల్ (ముంబై), హెచ్ఎస్బీసీ బ్యాంక్, ముంబై సెంట్రల్ స్టేషన్ వంటి ఎన్నో నిర్మాణాలలో భాగమైన షాపూర్జీ గ్రూప్.. భారత్ లోనే గాక మధ్యఆసియాలోకూడా పలు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం కడుతున్నది కూడా షాపూర్జీ గ్రూపే.

ఇక పేరుమోసిన భవనాల సంగతి పక్కనబెడితే క్రికెట్ తో షాపూర్జీ గ్రూప్ కు విడదీయరాని అనుబంధముంది. భారత్ లోని పలు క్రీడా మైదానాల నిర్మాణంలో పల్లోంజి గ్రూప్ భాగమైంది. అందులో.. 

- జవహర్లాల్ నెహ్రూ స్టేడియం : న్యూఢిల్లీ 
- బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ : నోయిడా 
- సుబ్రతా రాయ్ సహారా స్టేడియం (ఎంసీఏ స్టేడియం) - పూణే (ఇటీవల ముగిసిన ఐపీఎల్-15 లో పూణేలో జరిగిన మ్యాచులన్నీ ఇక్కడ నిర్వహించినవే) 
- విదర్భ క్రికెట్ అసోసియేషన్ - నాగ్పూర్ 
- ఆర్జీఐసీఎస్ - డెహ్రాడూన్ 
వీటన్నికంటే షాపూర్జీ గ్రూప్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం అభివృద్ధి పనుల్లో భాగమవడం విశేషం. వాంఖెడే కు సమీపంలో నిర్మించిన ఈ స్టేడియంలో వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులను అద్దిన ఘనత షాపూర్జీదే. ఐపీఎల్-15 లో బ్రబోర్న్ వేదికగా పదుల సంఖ్యలో మ్యాచులను నిర్వహించిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. 157 ఏళ్ల చరిత్ర

టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు అయిన మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు అధిపతి. దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, టాటా గ్రూప్‌లో 18.4 శాతం వాటాను కలిగి ఉంది. ఈ సమూహం 1865లో ఏర్పడింది మరియు దాని వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇది ఇంజనీరింగ్ మరియు నిర్మాణం, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, నీరు, శక్తి మరియు ఆర్థిక సేవలు వంటి వివిధ విభాగాలలో వ్యాపారం చేస్తుంది. భారతదేశం కాకుండా, దాని వ్యాపారం ఆసియా నుండి ఆఫ్రికా వరకు దాదాపు 50 దేశాలలో విస్తరించి ఉంది.