Asianet News TeluguAsianet News Telugu

లీచ్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల.. ఇంగ్లాండ్‌కు కీలక ఆధిక్యం..

PAKvsENG 2022: ముల్తాన్ వేదికగా జరుగుతున్న  పాకిస్తాన్ - ఇంగ్లాండ్ టెస్టులో స్పిన్నర్లు  మ్యాచ్ ను మలుపు తిప్పుతున్నారు. నిన్న అబ్రర్ అహ్మద్ మాయాజాలంతో ఇంగ్లాండ్ దెబ్బతినగా నేడు ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బకు పాక్ కుదేలైంది. 
 

PAKvsENG 2nd Test: Jack Leach Collapses Pakistan on 202, England Gain First Innings gain in Multan
Author
First Published Dec 10, 2022, 1:52 PM IST

ఏరికోరి తయారుచేసుకున్న పిచ్ పై పాకిస్తాన్ తడబడింది. రావల్పిండిలో  ఫ్లాట్ పిచ్ తో విమర్శల పాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)..   ముల్తాన్ లో స్పిన్ పిచ్ ను తయారుచేసింది. ఇందుకు అనుగుణంగానే తొలి ఇన్నింగ్స్ లో  ఆ జట్టు అరంగేట్ర స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ దుమ్మరేపాడు. ఇంగ్లాండ్ ను 281 పరుగులకే కట్టడి చేశాడు. నిన్న అబ్రర్ మాయ  చేస్తే నేడు ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్  మంత్రమేశాడు.  తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్.. 62.5 ఓవర్లలో  202 పరుగులకే చాపచుట్టేసింది.  

ఓవర్ నైట్ స్కోరు 107 - 2 వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్.. నెమ్మదిగానే ఆడింది. నిన్నటి స్కోరు కు బాబర్ ఆజమ్ (75) మరో 14 పరుగులు జోడించాడు.  సౌద్ షకీల్ (63) కూడా అర్థ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.  కానీ రాబిన్సన్.. ఇంగ్లాండ్ కు బ్రేక్ ఇచ్చాడు. 

రాబిన్సన్ వేసి 34.2వ ఓవర్లో బాబర్.. రాబిన్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అర్థ సెంచరీ చేసుకున్న షకీల్ ను జాక్ లీచ్ ఔట్ చేశాడు.  ఇక ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు.  ఒక్క ఫహీమ్ అష్రఫ్ (22) తప్ప మిగిలిన ఆరుగురు  రెండంకెల స్కోరు కూడా చేయలేదు. 

మహ్మద్ రిజ్వాన్ (10) ను లీచ్ బౌల్డ్ చేయగా  అగా సల్మాన్ (4) ను రూట్ పెవిలియన్ కు పంపాడు. నవాజ్ కూడా లీచ్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు.ఫహీమ్ అష్రఫ్ ను  మార్క్ వుడ్ ఔట్ చేయడంతో   పాకిస్తాన్ ఇన్నింగ్స్ 62.5 ఓవర్ల వద్ద202 పరుగులకు ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ కు  79 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.

 

ఇంగ్లాండ్ బౌలర్లలో  జాక్ లీచ్ కు నాలుగు వికెట్లు దక్కగా మార్క్ వుడ్, జో రూట్ లు తలా రెండు వికెట్లు తీశారు.  జేమ్స్ అండర్సన్, రాబిన్సన్ లు చెరో వికెట్ పడగొట్టారు.  స్వల్ప ఆధిక్యం సాధించిన తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చింది.  ఆటకు మరో మూడు రోజులు మిగిలిఉండటంతో ఈ మ్యాచ్ లో కూడా ఫలితం తేలే  అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios